Rasamayi Balakishan : బైక్ కోసం పీటల మీద ఆగిన పెళ్లి.. ఎమ్మెల్యే రసమయి ఏం చేశారంటే
Rasamayi Balakishan : పెళ్లికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఆగకుండా జరిగేలా చేశారాయన.

Rasamayi Balakishan
Rasamayi Balakishan Big Heart : అదో పెళ్లి వేడుక. కల్యాణ మండపం బంధువులు, అతిథులతో నిండుగా ఉంది. అంతా సందడిగా ఉంది. వధూవరులు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లి ఆగిపోయింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
పెళ్లి ఎందుకు ఆగిందంటే.. బైక్ కోసం. అవును.. బైక్ కొనివ్వలేదని పెళ్లి పీటల మీదే వివాహం ఆగిపోయింది. బైక్ కొనివ్వలేదని పెళ్లి కొడుకు అలిగాడు. పెళ్లి చేసుకోను అని మొండికేశాడు. దాంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. చివరి క్షణంలో ఇలా జరిగిందేంటి? అని కంగారుపడ్డారు. ఇక, ఈ పెళ్లి జరగదని అంతా అనుకున్నారు. కంతటడి పెట్టారు. కానీ, ఆ పెళ్లి జరిగింది. దానికి కారణం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
పెళ్లికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఆగకుండా జరిగేలా చేశారాయన. బైక్ కొనిస్తేనే తాళి కడతానని, లేదంటే పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోతానని పెళ్లికొడుకు భీష్మించుకు కూర్చున్నాడు. అదే సమయంలో ఆ వివాహానికి గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. పెళ్లి కొడుక్కి నచ్చ చెప్పారు. పెళ్లి కూతురిని ఓదార్చారు. అంతేకాదు, బైక్ కి కావాల్సిన డబ్బు కూడా ఇచ్చారు.
పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందని, పెళ్లి కూతురు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ బాధాకరమైన సంఘటనను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చలించిపోయారు. వెంటనే పెళ్లికొడుకుతో మాట్లాడారు. తాను బైక్ కొనిస్తానని చెప్పారు. మాట ఇవ్వడమే కాదు లక్ష రూపాయల నగదును పెళ్లి కానుకగా ఇచ్చారు. దీంతో పెళ్లికుమారుడు వివాహానికి అంగీకరించాడు. పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు.
పీటల మీద ఆగిపోతుందనుకున్న పెళ్లిని ఎమ్మెల్యే స్వయంగా జరిపించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దయాగుణాన్ని, పెద్ద మనసుని మెచ్చుకున్నారు. వధువు తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఎమ్మెల్యేకి థ్యాంక్స్ చెప్పారు.