నేను ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి : కేసీఆర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 04:24 PM IST
నేను ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి : కేసీఆర్

ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్‌ దాడులు జరిగాయి.సర్జికల్ స్ట్రైక్స్ విషయాలు బయటకు చెప్పరు. అవి వ్యూహాత్మక దాడులు. వాళ్లు చేస్తారు. మనం చేస్తాం. దానికి నరేంద్ర మోడీ మొన్న సర్జికల్‌ స్ట్రైక్‌ అంటే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని డొల్ల ప్రచారం చేశారు. చీమ కూడా చావలేదని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చెప్పాడు. ఈ ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరు అని మోడీని ప్రశ్నించారు.రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బీసీలకు ఏమైనా చేశారా అని మోడీని నిలదీశారు.సుమారు 72 ఏళ్లు దేశాన్ని పాలించిన ఈ రెండు పార్టీలు బీసీ మంత్రిత్వశాఖ పెట్టలేదని కేసీఆర్ అన్నారు.ప్రజల బాధలు ఈ రెండు పార్టీలతో తీరవన్నారు.

దేశం బాగు కోసం జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ అన్నారు. ప్రజల ఆశీస్సులతో దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామని తెలిపారు.భూ పట్టాలకు ఎవరూ లంచాలు ఇవ్వొద్దని, నెలన్నర రోజుల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఆర్ ఎస్ భరతం పడతామని బీజేపీ పగటికలలు కంటోందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు.