Monoclonal Antibodies : కరోనా రోగులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త చికిత్స, వారంలో కోలుకుంటారు

కరోనాకు దేశంలో మరో కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. వైరస్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ విధానాన్ని ఏఐజీ, యశోద ఆసుపత్రుల్లో రోగులకు అందించారు. కరోనాపై ఇది అద్భుతంగా పని చేస్తుందని ఏఐజీ(ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

Monoclonal Antibodies : కరోనా రోగులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త చికిత్స, వారంలో కోలుకుంటారు

Monoclonal Antibodies

Monoclonal Antibodies : కరోనాకు దేశంలో మరో కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. వైరస్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ విధానాన్ని ఏఐజీ, యశోద ఆసుపత్రుల్లో రోగులకు అందించారు. కరోనాపై ఇది అద్భుతంగా పని చేస్తుందని ఏఐజీ(ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే, ఆసుపత్రుల్లో వెంటిలేషన్ పై ఉన్న రోగులకు ఈ చికిత్స పని చేయదని, కరోనా సోకిన తొలి రోజుల్లో ఈ విధానాన్ని అవలంభిస్తే వారం రోజుల్లోనే వైరస్ నుంచి బయటపడవచ్చని తెలిపారు. షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారికి, 55ఏళ్లు పైబడిన వారికి కరోనా సోకితే, పరిస్థితి విషమించకుండా ఈ చికిత్స విధానం పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.



ఇప్పటిదాకా కరోనా చికిత్సకు సరైన మందు లేదు. కొన్ని ఔషధాలపై ట్రయల్స్ నిర్వహించి విధి లేని పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగానే వాటిని రోగులకు వినియోగిస్తున్నారు. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా నియంత్రణ చేయి దాటిపోవడానికి ఇదే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఓ తీపి కబురు అందించారు వైద్యులు. కరోనా సోకిన రోగులకు పరిస్థితి విషమించకుండా నివారించగలిగే ఓ అద్భుతమైన విధానాన్ని వైద్యులు గుర్తించారు. అదే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆధారిత ట్రీట్ మెంట్. అమెరికాకు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు తయారు చేసిన మందులను ఈ కాక్ టెయిల్ చికిత్సకు వాడుతున్నారు. వీటికి డీసీజీఏ అనుమతులు కూడా ఉన్నాయి.



కాసిరివిమాబ్(casirivimab), ఇమ్ డెవిమాబ్(imdevimab) మిశ్రమమే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధం. ఈ మందు పని తీరును ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. ఒబెసిటీ, కిడ్నీ, డయాబెటిస్, కేన్సర్ పేషెంట్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు ఉన్నవారితో పాటు 55ఏళ్లు పైబడిన వయసున్న వారందరికి ఈ ఔషధం అద్భుతంగా పని చేస్తుందని తెలిపారు. ఈ మందు ఉపయోగంలో వైరస్ సోకిన తర్వాత తొలి ఏడు రోజుల్లో అత్యంత కీలకం అన్నారు. ఆర్టీపీసీఆర్ లేదా ఇతర టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయిన మూడు రోజుల్లోపు రోగులకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అందించాల్సి ఉంటుందన్నారు.



అయితే, 7 రోజుల తర్వాత ఈ డ్రగ్ ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు. వైరస్ నిర్ధారణ అయిన తర్వాత మొదటి మూడు రోజుల్లోపు ఈ మందు ఉపయోగించడం ప్రారంభిస్తే వారం రోజులకే వైరస్ నుంచి కోలుకోవచ్చని డాక్టర్లు వివరించారు. దీని ధర ఎక్కువని, చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్న 12ఏళ్లు పైబడిన చిన్నారులకు కూడా ఈ మందు ఉపయోగించ వచ్చన్నారు. కరోనా విషమించి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని ఈ మందు తగ్గిస్తుందన్నారు నాగేశ్వర్ రెడ్డి.



నాడు ట్రంప్‌ తీసుకున్నది ఈ చికిత్సే:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొవిడ్‌ బారిన పడినప్పుడు మోనోక్లోనల్‌ యాంటీబాడీలనే ఎక్కించారు. రెండు రోజుల్లోనే ట్రంప్‌ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్‌ లోడ్‌ గణనీయంగా తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు.

ఎప్పుడు ఇవ్వాలంటే…
* వైరస్‌ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి. దీని ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది.
* వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్‌ లోడ్‌ బాగా పెరిగిపోయి ఉంటుంది.
* ఇంజక్షన్‌ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయించాలి.
* అందులో ‘సైకిల్‌ త్రెషోల్డ్‌(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి.
* ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం. ఉదాహరణకు 15 సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తిస్తే.. వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని అర్థం.
* అదే 30 సైకిల్స్‌లో వైరస్‌ను నిర్ధారిస్తే.. వారిలో లోడ్‌ తక్కువగా ఉందని తెలుస్తుంది.
* 15 సీటీ వ్యాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే.. అప్పుడు ఆ ఇంజక్షన్‌ బాగా పనిచేసినట్లుగా గుర్తిస్తారు.



వీరికి ఇవ్వొకూడదు…
* ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి..
* బహుళ అవయవాలు దెబ్బతిన్నవారికి..
* గర్భిణులకు

ఇలా పని చేస్తుంది:
* మోనోక్లోనల్‌ చికిత్స పొందిన వారిలో 70-80 శాతం మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు.
* వారం రోజుల్లో పూర్తిగా నయమవుతుంది.
* ఈ ఔషధాన్ని పొందిన వారి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లదు.
* ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కొవిడ్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు.. శరీర కణాలకు మధ్య ఇవి అడ్డు గోడగా నిలుస్తాయి.
* ఫలితంగా వైరస్‌ శరీర అంతర్భాగంలోకి ప్రవేశించలేదు.
* వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే అవకాశం సన్నగిల్లుతుంది

ఎవరికి ఎక్కువ మేలు?
* 65 ఏళ్లు దాటిన వారికి..
* స్థూలకాయులకు అంటే ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి..
* దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు..
* ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి..
* రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి.. ఉదాహరణకు క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి.
* 55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు..
* క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారికి..
* పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి..
* బాలింతలకు