కొత్త సచివాలయంలో మసీదు, గుడి, చర్చి – కేసీఆర్

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 06:32 AM IST
కొత్త సచివాలయంలో మసీదు, గుడి, చర్చి – కేసీఆర్

Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్‌ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని ప్రార్థనామందిరాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయ భవనాలను కూల్చివేసింది.




ఈ సందర్భంగా అక్కుడున్న ఆలయానికి, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది. దీంతో వాటి స్థానంలో ప్రభుత్వ ఖర్చుతో కొత్త ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. మ‌సీదుల నిర్మాణంపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాల‌ను తీసుకున్నారు.




750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్ తో సహా రెండు మసీదులను నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. నిర్మాణం పూర్తయ్యాక ఆ మసీదులను వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తామన్నారు. అటు కొత్త దేవాల‌యాన్ని 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. నిర్మాణం పూర్తయ్యాక ఆ ఆలయ బాధ్యతలను దేవాదాయ శాఖకు అప్పగించనుంది.

ఇక క్రిస్టియన్ల కోరిక మేరకు సచివాలయంలో చర్చిని కూడా నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. మసీదు, చర్చి. గుడికి ఒకే రోజు శంకుస్థాపన చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముస్లింల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ముస్లిం పెద్దలకు వివరించారు సీఎం కేసీఆర్. ముస్లిం అనాథ పిల్లల కోసం నిర్మిస్తున్న అనీస్ -ఉల్ -గుర్భా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌నిధులు కేటాయిస్తామ‌న్నారు.




ఖబ్రస్థాన్ లు మరిన్ని రావాల్సిన అవసరం ఉంద‌న్నారు. స్మశానవాటికల కోసం స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరామన్నారు కేసీఆర్.