BJP బలపడుతుందా : జనవరి 7న బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 04:03 PM IST
BJP బలపడుతుందా : జనవరి 7న బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన్నేసింది. మోత్కుపల్లి నర్సింహులుతో పాటు ముఖ్య నేతలను బీజేపీలో చేర్చుకునే పనిలో ఆ పార్టీ అధిష్టానం ఉందని సమాచారం. జనవరి 7న మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. 

రెండు రోజుల కిందట మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన లక్ష్మణ్… బీజేపీలో చేరాల్సిందిగా మోత్కుపల్లిని ఆహ్వానించారట. దీంతో మోత్కుపల్లి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ మధ్య వరుసగా భేటీ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ స్థితిగతులపైనా డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం.

మున్సిపాలిటీల్లో బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై ఇరువురూ చర్చిస్తున్నారని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. గతంలో పార్టీల్లోకి వస్తామంటూ పెండింగ్‌లో పెట్టిన వారిని వెంటనే చేర్చుకుంటే మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో బీజేపీ పెద్దలు ఉన్నారట. అలాంటి వారందరిని పార్టీలోకి ఆహ్వానించడంపై చర్చలు జరుపుతున్నారట.

మోత్కుపల్లి తెలంగాణ టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. చంద్రబాబు చర్యలకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే మోత్కుపల్లి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మీడియా సాక్షిగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మళ్లీ గెలవకూడదని తిరుమలకు పాదయాత్ర కూడా చేశారు. కాగా, మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఏ పార్టీలోకి వెళ్లాలో తెలీక ఆయన ఇన్నాళ్లూ సందిగ్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయం విరమించుకున్నారు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. కీలక నేతలకు గాలం వేస్తున్న తరుణంలో మోత్కుపల్లి కాషాయ దళంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట.

Also Read : వాళ్లకు మాత్రమే : రీచార్జ్ చేసుకుంటే రూ.4లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్