Movie Tickets: తెలంగాణలో సినిమాలు చూడం.. టిక్కెట్ల ధరలపై ప్రేక్షకులు ఆగ్రహం

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల మోత మొదలైంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ప్రతాపాన్ని చూపుతున్నారు థియేటర్, మల్టీప్లెక్స్‌ ఓనర్లు.|

Movie Tickets: తెలంగాణలో సినిమాలు చూడం.. టిక్కెట్ల ధరలపై ప్రేక్షకులు ఆగ్రహం

Movie Tickets

Movie Tickets: తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల మోత మొదలైంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ప్రతాపాన్ని చూపుతున్నారు థియేటర్, మల్టీప్లెక్స్‌ ఓనర్లు. తెలంగాణ ప్రభుత్వం మల్టీప్లెక్స్‌లో కనిష్టంగా 100 రూపాయలు.. గరిష్టంగా 250 రూపాయలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నాయి మల్టీప్లెక్స్‌, థియేటర్ యాజమాన్యాలు. వీటికి జీఎస్టీ అదనం కావడంతో ఇప్పుడు థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లే సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.

తెలంగాణ ప్రభుత్వం అలా జీవో జారీ చేసిందో లేదో.. టికెట్‌ రేట్లను ఆమాంతం పెంచేసింది పీవీఆర్‌ సినిమాస్‌. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తమ మల్టీప్లెక్స్‌లలో 50 శాతం పెంచుతున్నట్టు మొన్ననే ప్రకటించింది. తాము పెంచిన రేట్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 62 స్క్రీన్లకు వర్తిస్తాయంది.

ఇక మిగతా మల్టీప్లెక్స్‌, ఏసీ థియేటర్లకు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. విడుదలై రెండు వారాలు దాటినా పుష్ప సినిమా రేట్లు ఇప్పటికీ తగ్గలేదు. మల్టీప్లెక్స్‌ల్లో ఈ సినిమా టికెట్‌ ధర అన్ని టాక్సులతో కలుపుకొని 280 నుంచి 320 వరకూ ఉండగా.. రిక్లైనర్ సీట్లకు వచ్చే సరికి ఆ రేటు 388 రూపాయలు ఉంది.. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక RRR రిలీజ్‌ అయితే.. టికెట్‌ రేట్లు ఏం రేంజ్‌కు వెళ్తాయో అని టెన్షన్ పడుతున్నారు మూవీ ఫ్యాన్స్.

ఓవైపు ఏపీలో టికెట్లు రేట్లు అట్టడుగున ఉంటే.. తెలంగాణలో మాత్రం సామాన్యుడికి అందనంతగా ఆకాశంలో ఉన్నాయి.. ఓ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళితే టికెట్లకే 12 వందల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. ఇక పాప్‌కార్నో.. కూల్‌ డ్రింకో కొన్నామంటే ఇక అంతే సంగతులు.

టికెట్ రేట్లను ఈ స్థాయిలో పెంచడం చిన్న సినిమాల మనుగడకు కూడా ముప్పే అంటున్నారు కొందరు.. పెద్ద సినిమాలైతే కొంచెం కష్టమైనా తప్పక భరిస్తారేమో కానీ.. చిన్న సినిమాలకు ఇంత భారీగా టికెట్ కొని థియేటర్లకు రావడం కష్టమేనన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో చిన్న సినిమా టిక్కెట్ ధరలు తగ్గబోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకే అమ్మాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు నిర్ణయించారు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించబోతున్నారు.