MLA Seethakka : అమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నా వదల్లేదు.. డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల పేరుతో కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆస్పత్రికి వెళ్తున్నానని ఆధారాలు చూపించినా వదలడం లేదనే టాక్ వినిపిస్తోంది.

MLA Seethakka : అమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నా వదల్లేదు.. డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

Mla Seethakka

MLA Seethakka : తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల పేరుతో కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆస్పత్రికి వెళ్తున్నానని ఆధారాలు చూపించినా వదలడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల సినీ నటుడు నిఖిల్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా ఎమ్మెల్యే సీతక్క కుటుంబసభ్యులకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి రక్తదానం చేసేందుకు వెళ్తుండగా.. తమ బంధువులను పోలీసులు అడ్డుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఈ-పాస్ ఉన్నప్పటికీ కనీస కనికరం లేకుండా ప్రవర్తించారని మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదన తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు రక్తం అవసరం అయ్యింది. సీతక్క బంధువులు రక్తం ఇచ్చేందుకు ములుగు నుంచి పర్మిషన్ తో హైదరాబాద్ వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా ప్రయాణించేలా ములుగు జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారిని మల్కాజ్‌గిరి డీసీసీ రక్షిత అడ్డుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తారా? అని కోప్పడ్డారని తెలిపారు. తాము ఈ-పాస్ తీసుకున్నామని చెప్పినా డీసీపీ వినలేదని సీతక్క ఆరోపించారు.

వీడియో కాల్ చేసి.. తన తల్లిని చూపించినా పట్టించుకోలేదని వాపోయారు. అడ్డుకోవడమే కాకుండా తమ బంధువులతో దురుసుగా మాట్లాడుతూ అరగంటసేపు పక్కకు నిలబెట్టారన్నారు. తాను వీడియో కాల్ చేసినా డీసీపీ మాట్లాడే ప్రయత్నం చేయలేదన్నారు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ తన వాళ్లపై డీసీపీ రక్షిత మండిపడ్డారన్నారు. ఎమ్మెల్యేకే ఇలాంటి అనుభవం ఎదురైతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే సీతక్క వాపోయారు.

డీసీపీ రక్షిత తన డ్యూటీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. కింది స్థాయి సిబ్బంది మానవతా దృక్ఫధంతో తమ వారికి అనుమతి ఇచ్చారన్నారు. అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే అన్నారు. ఎవరి పరిస్థితి ఏంటో.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకోవాలని సూచించారు. మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. డీసీపీ రక్షిత ఇలాంటి వారుంటే చాలామంది ప్రాణాలు పోతాయని అన్నారు. మల్కాజ్‌గిరి డీసీసీ తీరుపై ట్విటర్ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సీతక్క.