Amit Shah : మునుగోడులో గెలిచి తీరాల్సిందే.. ఉపఎన్నికపై అమిత్ షా దిశానిర్దేశం

మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.

Amit Shah : మునుగోడులో గెలిచి తీరాల్సిందే.. ఉపఎన్నికపై అమిత్ షా దిశానిర్దేశం

Amit Shah : మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. మూడు నాలుగు రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ముగ్గురు నాయకులతో కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీలో రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి నేతలు ఉండాలని సూచించారు. ఇక ఉపఎన్నికలపై అమిత్ షా తో ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో రాజగోపాల్ రెడ్డి సమావేశం అయ్యారు.

బూత్ కమిటీలు పక్కాగా పని చేయాలని షా సూచించారు. గ్రామాల వారిగా ఇంఛార్జ్‌ల నియామకం పూర్తి చేయాలన్నారు. జాయినింగ్ కమిటీ ప్రగతిపైనా రాష్ట్ర నేతలను ఆరా తీశారు. మునుగోడు గడ్డపై కాషాయ జెండా ఎగిరేలా స్థానిక నాయకులు, రాష్ట్ర నేతలు శ్రమించాలని షా సూచించారు. మునుగోడులో విజయం సాధిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభం అవుతుందని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక.. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ ఉపఎన్నికల్లో గెలుపుని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి.

తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపైనే పార్టీ నేతలతో అమిత్ షా చర్చించారు. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగిందని తెలుస్తోంది. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమిత్ షా ఆదేశించారని తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపైనా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మునుగోడులో ప్రచారం పెంచాలని సూచించిన అమిత్ షా.. పార్టీ తరుపున కమిటీని నియమించాలని ఆదేశించారట. మునుగోడులో గెలిచి తీరాలని చెప్పిన అమిత్ షా.. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారట. ప్రతి గ్రామానికి ముగ్గురు నేతలను ఇంచార్జులుగా నియమించాలని సునీల్ బన్సల్ ను ఆదేశించారు షా.

ఈ సమావేశంలో రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. జాతీయ నాయకత్వం అంచనాలను అనుగుణంగా పని చేయలేకపోతున్నారని.. లక్ష్యాలను అందులేకపోతున్నారన్నంటూ క్లాస్ పీకారట. పార్టీలో సమన్వయం లోపించిందని.. కొందరు నేతలు సరిగా పని చేయడం లేదని షా మండిపడ్డారని సమాచారం. కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్న జనాలు బీజేపీ పట్ల ఆసక్తిగా ఉన్నా.. నేతలు సరిగా పనిచేయడం లేదని అన్నారట.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని షా ఫైర్ అయ్యారు.