Nalgonda Lok Sabha Constituency : వచ్చే ఎన్నికల్లో నల్గొండలో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు…. ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని బీఆర్ఎస్‌ టార్గెట్‌

నల్గొండ పరిధిలో కీలక నియోజకవర్గం.. నాగార్జునసాగర్‌. నోముల భగత్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నోముల నర్సింహ్మాయ్య అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డిపై నోముల భగత్ సంచలన విజయం సాధించారు. బీఆర్ఎస్‌ తరపున మరోసారి భగత్‌ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.

Nalgonda Lok Sabha Constituency : వచ్చే ఎన్నికల్లో నల్గొండలో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు….  ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని బీఆర్ఎస్‌ టార్గెట్‌

Nalgonda

Nalgonda Lok Sabha Constituency : రాజకీయానికి మలుపులు నేర్పించిన జిల్లా జిల్లా.. ఉమ్మడి నల్గొండ ! పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో.. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంత ఈజీగా అంచనా వేయలేం! స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో నల్గొండ ఓటర్లు ముందుంటారు. పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన వేళ.. నల్గొండ పార్లమెంట్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. నల్గొండ ఎంపీ సీటు గెలిచి రికార్డ్ బ్రేక్‌ చేయాలని బీఆర్ఎస్‌ పావులు కదుపుతుంటే.. కంచుకోటపై పట్టు సాధించాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. రెండు పార్టీల్లో లుకలుకలపై నజర్ పెంచిన బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ అంటుంటే.. టీడీపీ కూడా పోటీకి సై అంటోంది. ఇంతకీ నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో రాజకీయం ఎలా ఉంది.. కాంగ్రెస్ బౌన్స్‌బ్యాక్ అవుతుందా.. అసెంబ్లీలపై బీఆర్ఎస్‌ గ్రిప్‌ నిలుస్తుందా.. కోమటిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాన్ని టర్న్ చేస్తుందా.. బీజేపీ ఆశలేంటి.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ లక్ష్యాలేంటి..

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం.. కాంగ్రెస్‌కు కంచుకోట. గులాబీ పార్టీ ఇప్పటివరకు నల్గొండ ఎంపీ గెలవలేదు. ఏడేసి సార్లు కాంగ్రెస్, వామపక్షాలు విజయం సాధించగా.. రెండుసార్లు మాత్రం టీడీపీ విజయం దక్కించుకుంది. నల్గొండ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కారు పార్టీ కైవసం చేసుకున్నా.. పార్లమెంట్‌ స్థానంలో మాత్రం జెండా ఎగురవేయలేకపోయింది. నల్గొండ అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి కోటకు బీటలు వారుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుంటే.. ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని బీఆర్ఎస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. బీజేపీకి బలం తక్కువే అయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ముందు పెట్టి చక్రం తిప్పాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో నల్గొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

READ ALSO : Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా ?

uthamkumar,janareddy,damodar reddy, narasimhareddy

uthamkumar,janareddy,damodar reddy, narasimhareddy

అసెంబ్లీ బరిలో నల్గొండ సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి….కాంగ్రెస్ టికెట్ రేసులో జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి

నల్గొండ పార్లమెంట్‌కు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే తప్ప.. ఉత్తమ్ మరోసారి ఎంపీగా పోటీ చేయడం దాదాపు లేనట్లే ! దీంతో ఎంపీ టికెట్‌ రేసులో పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయ్. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌ నుంచి టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలో ఒకరు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయ్. జాతీయస్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న వేళ.. ఎంపీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఆచీతూచీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయ్. జాతీయస్థాయి పొత్తులు, అవసరాలకు అనుగుణంగా వామపక్షాలకు సీటు కేటాయించినా ఆశ్చర్యం అవసరం లేదనే చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ కూడా నల్గొండ మీద గురి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా అభ్యర్థిని ఫైనల్‌ చేసే చాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు కమలం పార్టీ నుంచి రేసులో నిలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి బలమైన నేత కమలం గూటికి చేరుకుంటే.. వారిని పోటీకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదు.

నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో నల్గొండతో పాటు.. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయ్.

Bhupal, komatireddy

Bhupal, komatireddy

నల్గొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరోసారి బరిలో…కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డికి టికెట్ దక్కేనా?

నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ దాదాపు కన్ఫార్మ్. ఐతే సొంత పార్టీలో గ్రూప్‌ తగాదాలు.. కంచర్లకు ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక నేతలకు కంచర్లకు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం నడుస్తోంది. ఇక కంచర్లను మార్చే అవకాశం ఉంటే.. తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ దక్కేలా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ కంచుకోట. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయగా.. ఆయన తీరుతో ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. నల్గొండ అసెంబ్లీ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు దుబ్బాక నర్సింహ్మరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయ్. బీజేపీ నుంచి నూకల నర్సింహ్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నా.. బలమైన నాయకులెవరైనా చేరితే వారికే బీజేపీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్.

READ ALSO : Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరిపై బిజెపి కన్ను… పట్టు సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీలు… వ్యూహాల్లో నిమగ్నమైన గులాబీ పార్టీ

ravindra, balunaik

ravindra, balunaik

దేవరకొండ నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రవీంద్ర నాయక్‌ మరోసారి పోటీకి సిద్ధం…

దేవరకొండ.. ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. రవీంద్రనాయక్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు పెద్దగా పోటీ కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ రవీంద్రనాయక్‌ కారు పార్టీ నుంచి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే బీఆర్‌ఎస్‌, వామపక్షాలు పొత్తులో భాగంగా.. ఈ సీటును సీపీఐకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో పాటు.. ఉస్మానియా జేఏసికి చెందిన రవినాయక్… స్థానికనేతలు బిల్యా నాయక్, కిషన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు.

bhagath,janareddy

bhagath,janareddy

నాగార్జునసాగర్‌ బీఆర్ఎస్‌ తరపున మళ్లీ భగత్‌ పోటీ…. కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి మళ్లీ సాగర్ బరిలో దిగే అవకాశాలు

నల్గొండ పరిధిలో కీలక నియోజకవర్గం.. నాగార్జునసాగర్‌. నోముల భగత్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నోముల నర్సింహ్మాయ్య అకాలమరణంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డిపై నోముల భగత్ సంచలన విజయం సాధించారు. బీఆర్ఎస్‌ తరపున మరోసారి భగత్‌ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. గొర్రెలు, మేకల సహకార సంస్థ చైర్మన్‌గా ఉన్న ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా లేదంటే తన తనయుడు రఘువీర్‌ రెడ్డిని బరిలోకి దింపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రఘువీర్ రెడ్డి మరో నియోజకవర్గం నుంచి బరిలో దిగితే… జానారెడ్డి మరోసారి పోటీలో నిలిచే చాన్స్ ఉంది. బీజేపీకి ఇక్కడ బలమైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడి కోసం కమలం పార్టీ అన్వేషిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెంచిందనే చర్చ జరుగుతోంది.

READ ALSO : Mahbubabad Lok Sabha Constituency : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మలుపులు తిరుగుతున్న రాజకీయాలు….గులాబీ పార్టీ మళ్లీ పట్టు నిలుపుకుంటుందా ?

bhaskarrao,sankharnaik,raghveer

bhaskarrao,sankharnaik,raghveer

మిర్యాలగూడ నియోజకవర్గంపై పట్టుసాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు….కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ బరిలోకి దిగే అవకాశాలు

మిర్యాలగూడలో నలమోతు భాస్కర్ రావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో.. మరో నియోజకవర్గంపై ఆయన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పొత్తులో భాగంగా.. మిర్యాలగూడ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే.. సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయం అయినట్లే. కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్‌లో బరిలో దిగాలి అనుకుంటే.. తనయుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మిర్యాలగూడలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల్లో లుకలుకలతో బలమైన అభ్యర్థి ఎవరైనా తమ పార్టీలో చేరిపోతారేమోననే ఆశగా ఎదురుచూస్తోంది బీజేపీ.

saidireddy,padmavathi

saidireddy,padmavathi

మరోసారి పోటీకి సిద్ధమౌతున్న హుజూర్‌నగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి…కాంగ్రెస్ అభ్యర్ధినిగా మరోమారు బరిలో ఉత్తమ్ సతీమణి పద్మావతి

హుజూర్‌నగర్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యైగా ఉన్నారు. ఉపఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిని ఓడించి భారీ మెజార్టీతో సైదిరెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి కూడా ఆయనే పోటీ చేయనున్నారు. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్.. ఈసారి శాసనసభకు పోటీ చేస్తానని చెప్తున్నా.. అది హుజూర్‌నగర్‌ నుంచా.. కోదాడ నుంచా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య.. హుజుర్‌నగర్‌లో టఫ్‌ఫైట్‌ కనిపించే అవకాశంఉంది. దీంతో ఉత్తమ్ కోదాడకు మొగ్గుచూపుతారని.. హుజుర్‌నగర్‌ నుంచి సతీమణి పద్మావతిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికి పోటీ చేసే అవకాశం దక్కకపోతే.. హుజూర్‌నగర్‌ నుంచి ఎన్‌ఆర్ఐ అప్పిరెడ్డి చాన్స్‌ దక్కవచ్చు. ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోని బీజేపీ.. ఈసారి కొత్తవారిని బరిలో దింపే చాన్స్ ఉంది.

READ ALSO : Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

mallaiah yadav

mallaiah yadav

కోదాడ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్న వర్గ విభేదాలు…కోదాడ మీద తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శ్రద్ధ

కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను వర్గవిభేదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్యేకు, మున్సిపల్‌ చైర్మన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌లకి టికెట్ అని కేసీఆర్‌ ప్రకటించినా.. బీఆర్ఎస్ నుంచి శశిధర్ రెడ్డి ఆశలు పెంచుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌ లేదా ఆయన సతీమణి పద్మావతి బరిలో నిలిచే చాన్స్ ఉంది. ఎమ్మెల్యే మీద జనాల్లో వ్యతిరేకత ఉందని.. అదే ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీంతో కోదాడ నుంచి పోటీకి ఉత్తమ్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రీబౌన్స్‌ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిన టీడీపీ.. కోదాడ మీద స్పెషల్‌ నజర్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు కంచుకోట అయిన కోదాడలో.. ఈసారి అభ్యర్థిని నిలిపేందుకు సైకిల్ పార్టీ సిద్ధం అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.

jagadish,damodhar

jagadish,damodhar

.
సూర్యాపేట నుండి బీఆర్ఎస్‌ నుంచి జగదీష్ రెడ్డి పోటీ…కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు

సూర్యాపేటలో మంత్రి జగదీష్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి సూర్యాపేటలో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జగదీష్‌ రెడ్డికి పోటీగా కాంగ్రెస్‌, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్‌ నుంచి జగదీష్ రెడ్డి పోటీ చేయడం ఖాయం కాగా.. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత దామోదర్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. దామోదర్ రెడ్డిని నల్లగొండ ఎంపీగా బరిలో నిలపాలని భావిస్తే .. రమేష్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్లే ! పీసీసీ చీఫ్ రేవంత్ కూడా.. రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరావుతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. నల్గొండ ఎంపీగా సంకినేని పోటీకి అంగీకరిస్తే.. సూర్యాపేటలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తరఫున బరిలో నిలవడం ఖాయం. బీఆర్ఎస్‌ నుంచి బీజేపీ గూటికి చేరుకున్న బూర.. సూర్యాపేటలో గెలిచి తీరాలని పట్టుదల మీద కనిపిస్తున్నారు.

READ ALSO : Ponguleti Srinivasa Reddy: ఖమ్మంలో తారస్థాయికి పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్.. ఎమ్మెల్యే సండ్రపై పొంగులేటి అనుచరుల విమర్శలు

నల్గొండ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే ! ఓటర్ తీర్పు క్లియర్‌గా ఉంటుంది ఇక్కడ ! ఒకప్పుడు కంచుకోట అయిన నల్గొండలో కాంగ్రెస్ స్లో అయింది. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్‌బ్యాక్ అయి.. తిరిగి పట్టు సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఐతే పార్టీలో గ్రూప్ తగాదాలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. హస్తం పార్టీలో నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు బీజేపీలో చేరగా.. మరొకరు పార్టీ మీద అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందని ఆసక్తికకరంగా మారింది. తీరని కలగా ఉన్న నల్గొండ పార్లమెంట్‌లో పాగా వేయాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహాలు రచిస్తున్న వేళ.. ఎంపీ స్థానాలు గెలుచుకోవడం గులాబీ పార్టీకి చాలా ముఖ్యం. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక అటు టీడీపీ కూడా కోదాడ మీద కాన్సన్‌ట్రేట్‌ చేయడం.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడంతో.. నల్గొండ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనే చర్చ నడుస్తోంది.