Maoist Sharadakka: బావ కోసం దళంలోకి.. దండకారణ్యంలో కరోనాతో ముగిసిన 30ఏళ్ల ప్రేమ కథ

అడవుల్లోకి బావకోసం వెళ్లి ముప్పై ఏళ్లపాటు దండకారణ్యంలో బతికి చివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సమ్మక్క ప్రేమ కథ ఇది.

Maoist Sharadakka: బావ కోసం దళంలోకి.. దండకారణ్యంలో కరోనాతో ముగిసిన 30ఏళ్ల ప్రేమ కథ

Maoist Leader Haribhushan Wife Sharadakka

Maoist Leader Haribhushan wife Sharadakka lifeless: అడవుల్లోకి బావకోసం వెళ్లి ముప్పై ఏళ్లపాటు దండకారణ్యంలో బతికి చివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన సమ్మక్క ప్రేమ కథ ఇది. అడవుల్లో దళంలో ముఖ్య సభ్యుడుగా ఉన్న యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ సొంత మరదలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద. మన్యంలో పుట్టిన వీరి ప్రేమకథకు దండకారణ్యంలో ఎండ్ కార్డ్ పడింది.

నాగరిక సమాజానికి దూరంగా నిత్యం తూటాలు, కన్నీళ్ల మధ్య.. చుట్టాలను వదిలి చట్టాలకు వ్యతిరేకంగా కష్టాలు పడుతూ.. ఏ నిమిషంలో ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో కేవలం బావ కోసం పోయిన మరదలు సమ్మక్క అలియాస్‌ శారద. మహబూబాబాద్‌ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంకు చెందిన సమ్మక్క, నారాయణలు సొంతం బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ప్రాణం. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన యాప నారాయణ, విద్యార్థి దశలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(RSU)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు.

అయితే, బావను ఎంతగానో ఇష్టపడి చదువు పూర్తయ్యాక మనువాడాలని భావించిన మరదలుకి దళంలో చేరిన బావ మీద ఇష్టం మాత్రం తగ్గలేదు. సొంతూరు, సొంతవారు అనే బంధాలను తెంచుకుని, బావను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసి బావ అడుగుల్లో అడుగై, ఆశయాలు పంచుకుంటూ బతకసాగింది. చివరికి బావతోనే కరోనా వైరస్‌కు బలై చనిపోయింది. ఈ నెల(జూన్) 21వ తేదీన హరిభూషణ్‌ కరోనాతో చనిపోగా.. 24న సమ్మక్క చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు జరిగాయి. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించారు.

మధ్యలో 2008లో అనారోగ్య కారణాలతో సమ్మక్క పోలీసులకు లొంగిపోగా.. ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డును ఆమెకే అందజేశారు. ఆపరేషన్ అనంతరం 2012లో ఆమె మళ్లీ అడవిలోకి బావ వద్దకే వెళ్లిపోయింది. అప్పటినుంచి మళ్లీ ఆమె అడవి నుంచి బయటకు రాలేదు.