Netannaku Cheyutha: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నేతన్నకు చేయూత.. దరఖాస్తు చేసుకోండి

నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం 'నేతన్నకు చేయూత'.

Netannaku Cheyutha: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నేతన్నకు చేయూత.. దరఖాస్తు చేసుకోండి

Handloom

Netannaku Cheyutha scheme: నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘నేతన్నకు చేయూత’. వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా చేనేత కార్మికులు పొదుపును ప్రోత్సహించడం, ఆర్థిక సహకారం అందించడం కోసం ప్రభుత్వం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నమోదు ప్రక్రియను స్టార్ట్ చెయ్యనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

కుటుంబ ఆదాయంలో 50 శాతం నేత పని ద్వారా పొందే 18 ఏళ్లు దాటిన వారు ఈ పథకానికి అర్హులు అన్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. రూ.368 కోట్లతో పునఃప్రారంభించిన ఈ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయగా.. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో చేనేత సంఘాల్లో, సహకారేతర రంగంలోని జియో ట్యాగింగ్‌ మగ్గాలపై పనిచేసే నేత కార్మికులు, వృత్తికి అనుబంధంగా డైయింగ్‌, టైయింగ్‌ డిజైన్‌, వైండింగ్‌, వార్పింగ్‌, సైజింగ్‌ పనులు చేసే వారి కోసం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులైన వారిని గుర్తిస్తుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత లబ్ధిదారుడు, సంబంధిత ఏడీ పేరు మీద ఉమ్మడి అకౌంట్‌ను బ్యాంకులో ప్రారంభించాలి.

లబ్ధిదారుడు తమ వేతనంలో 8 శాతాన్ని పొదుపు చేస్తే ప్రభుత్వం తమ వాటాగా ప్రతి నెలా 15లోగా 16 శాతం జమ చేస్తుంది. కార్మికులు 36 నెలల పాటు పొదుపు చేసిన తర్వాత అందుకు సంబంధించిన డబ్బును పొందుతారు. లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే కుటుంబీకులు లేదా ఇతర నామినీలకు ప్రభుత్వమే మొత్తం డబ్బును చెల్లిస్తుంది.