రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భర్త, ఐటీ ఉద్యోగిని లావణ్య ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భర్త, ఐటీ ఉద్యోగిని లావణ్య ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు

హైదరాబాద్ లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లావణ్యలహరి ఆత్యహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య భర్త, పైలెట్ అయిన వెంకటేశ్వర రావు ఓ ఎయిర్‌లైన్స్‌ మహిళా ఉద్యోగినితో వివాహేతర సంబంధం నెరుపుతూ.. లావణ్యకు సోషల్‌ మీడియాలో దొరికిపోయినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆ తర్వాతే అతడి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని తెలిసింది. భార్య గర్భవతి అని కూడా చూడకుండా గతంలో విచక్షణారహితంగా కొట్టగా గర్భస్రావం అయినట్లు పోలీసులకు తెలిసింది.

మరో మహిళలతో భర్త అక్రమ సంబంధం:
ఉద్యోగం పేరుతో భార్యను ఒంటరిగా వదిలి మరో మహిళతో విదేశాల్లో తిరిగిన విమాన టికెట్లు, వాట్సాప్‌ చాటింగ్‌లను లావణ్య తన మొబైల్ లో ఆధారాల కోసం భద్రంగా పెట్టుకున్నట్లు సమాచారం. మనోవేదనతో భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని తెలుస్తోంది. ‘నా జీవితాన్ని నాశనం చేయవద్దు’ అని సదరు యువతిని లావణ్య వేడుకుందని, ఈ విషయం తెలిసిన పైలెట్‌ చిత్రహింసలతో నరకం చూపించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఆకృత్యాలు భరించలేక అఘాయిత్యం చేసుకునేందుకు పై అంతస్థుకు వెళ్లిన భార్యను అక్కడే ఉన్న వెంకటేశ్వర రావు అడ్డుకోలేదని సమాచారం. వెంకటేశ్వర రావు, మరో మహిళ మొబైల్ కాల్‌ డేటాలపై ఆర్జీఐఏ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబంధం గురించి తెలిశాక మరింత రెచ్చిపోయిన భర్త:
భర్త వెంకటేష్ అకృత్యాలు భరించలేక లావణ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ గత కొంత కాలంగా లహరిపై భౌతిక దాడులకు తెగబడ్డాడు. మానసికంగా, శారీరకంగా లహరిపై దాడులు చేసేవాడు. తన అక్రమ సంబంధం గురించి భార్యకు తెలిసి అడ్డు పడుతుందన్న కోపంతో లహరిని మానసిక వేధింపులకు గురి చేయడమే కాకుండా భౌతికంగా చిత్రహింసలు పెట్టేవాడు. వెంకటేష్ వేధింపులు తట్టుకోలేక చివరకు లహరి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

భర్త అంటే చచ్చేంత ప్రేమ:
లహరి, వెంకటేష్‌లది ప్రేమ వివాహం. భర్తంటే ఆమెకు చచ్చేంత ప్రేమ. అతడేమో పిల్లలు పుట్టడం లేదనే నెపంతో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు లహరిపై చేయిచేసుకునేవాడు. అందుకు సాక్ష్యంగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. లహరిని వెంకటేష్ కొడుతున్నప్పుడు వారి పెంపుడు కుక్క అడ్డం వెల్లింది. దీంతో అతడు వెనక్కి తగ్గాడు. వెంకటేష్ దుర్మార్గాలన్నీ వాళ్ల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భర్తకు తోడు అత్తామామల సతాయింపులు కూడా పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకునే ముందు లావణ్య తన ఆవేదనంతా ఓ వీడియోలో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. సూసైడ్‌ నోట్‌ కూడా రాసింది.

ఆత్మహత్య కాదు హత్య:
అయితే తన కుమార్తెను వెంకటేశ్వర్‌ రావు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచే వెంకటేశ్వర్ రావు తన కుమార్తెను చాలా విధాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే వెంకటేశ్వర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. లావణ్య అత్తా మామలను పట్టుకునే పనిలో ఉన్నారు.