Hyderabad Market : హైదరాబాదులో వెరైటీ మార్కెట్స్..GHMC కొత్త యోచన..

Hyderabad Market : హైదరాబాదులో వెరైటీ మార్కెట్స్..GHMC కొత్త యోచన..

New  Vegitable Market Trends Hyderabad

Hyderabad Market: సాధారణంగా గ్రామాల్లో వారానికోసారి సంతలు పెడుతుంటారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా పలు ప్రాంతాల్లో వారం వారం మార్కెట్లు పెడుతుంటారు అచ్చం గ్రామాల్లో సంతలు లాగా. కానీ ఇప్పుడు నగరంలో ప్రతీ రోజు వెరైటీ మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో వెరైటీ కొంగొత్త మార్కెట్లు రూపుదిద్దుకుంటున్నాయి.

ఆయా కాలనీల్లో ఇప్పుడు వారం వారం నిర్వహిస్తున్న కూరగాయల సంతల మాదిరిగానే కొన్నిచోట్ల రోజూ మార్కెట్‌ నిర్వహించాలని యోచించింది జీహెచ్‌ఎంసీ. వీటి కోసం ఖాళీగా ఉండే ప్రభుత్వ స్థలాలు, రోడ్ల వెంబడి ఉన్న స్థలాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో పెట్టనున్న వెరైటీ మార్కెట్లలో అన్నీ రకాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా జీహెచ్ఎంసీ చేయనుంది. ఈ మార్కెట్లలో జనరల్, ఫ్యాన్సీవంటి అన్ని రకాల సామగ్రి అమ్మకాలు జరుగుతాయి.

రోడ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు చెత్త నిలయాలుగా మారుతున్నాయి. అలాగే ఖాళీగా ఉండే స్థలాల్లో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. జులాయిలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వీరి వల్ల ఆయా స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిని మార్చేందుకు చేసిన ఆలోచనల్లోంచి జనరల్, ఫ్యాన్సీ, తదితర వస్తువులమ్మే ఈ వెరైటీ మార్కెట్‌ ఆవిర్భవించింది.

వెరైటీ మార్కెట్ల రూల్స్ ఇలా..

  • నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే ఖాళీ ప్రదేశాలలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా పైన కప్పుతో పాటు కనీస సదుపాయాలు కల్పించి అంగడి మాదిరిగా చిరువ్యాపారులు తమ సరుకులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు..

 

  • ఈ ఖాళీ స్థలాలను ఎవరికీ పర్మినెంట్‌గా కేటాయించే ప్రసక్తే లేదు. ఎవరు వ్యాపారం చేసుకోవటానికి ముందుకొస్తే వారు ఖాళీగా ఉన్న ప్రదేశంలో సరుకుల్ని అమ్ముకోవచ్చు. అలా వ్యాపారం చేసుకోవాటానికి ఎలాంటి చార్జీ వసూలు చేయరు. కాకపోతే..ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వ్యాపారం పెట్టుకునేవారిదే..

 

  • ప్లాస్టిక్‌ బకెట్లు, మగ్గులు,లేడీస్‌ కార్నర్‌లో లభించే అన్ని రకాల వస్తువులు, ఇతరత్రా వివిధ రకాల ఫ్యాన్సీ, జనరల్‌ సామాగ్రిని చిరు వ్యాపారులు ఈ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు.

 

  • మెట్టుగూడలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో రూ.50 లక్షల వ్యయంతో వెరైటీ మార్కెట్‌ను రెడీ చేశారు అధికారులు. ఈ మార్కెట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మార్కెట్ దాదాపు 60 మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని తెలిపారు.

 

  • ప్రతిరోజూ ఉండే ఈ మార్కెట్‌లో చిరువ్యాపారులు పాటించాల్సిన విధివిధానాలు, తదితరమైనవి రూపొందించి త్వరలో ఈ మార్కెట్ ను ప్రారంభిస్తామని తెలిపారు.