ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త భయం, ఆ పేరు వింటే చాలు వణికిపోతున్నారు

  • Published By: naveen ,Published On : October 29, 2020 / 12:30 PM IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త భయం, ఆ పేరు వింటే చాలు వణికిపోతున్నారు

new fear for adilabad district trs mlas: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలున్నాయి. అన్నింటా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో కొందరు దూకుడుగా ఉంటే.. మరికొందరు మెతకగా వ్యవహరిస్తుంటారు. ఒక ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుమారు రెండేళ్లుగా అంతా బాగానే సాగుతోంది. కరోనా కష్టకాలం రావడంతో రాజకీయంగా కాస్త సైలెంట్‌ అయినా.. అడపాదడపా జనాలలో ఎమ్మెల్యేలు చురుకుగా తిరుగుతున్నారు. కాకపోతే వారికి కొత్త భయం పట్టుకుందని అంటున్నారు.




సోషల్ మీడియా వల్ల ఎమ్మెల్యేలకు తలనొప్పులు:
ప్రజలతో, ప్రతిపక్షాలతో సమస్య లేదు కానీ సోషల్ మీడియా వల్ల ఎమ్మెల్యేలు తలనొప్పులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వాటిలో ఎమ్మెల్యేల పని తీరు, వారి వ్యక్తిగత వ్యవహారాలపై ప్రత్యర్థి పార్టీల వారు, ఇతరులు కూడా ఘాటుగా పోస్టులు పెడుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూపుతూ వైరల్ అవుతున్నాయనే భావన వచ్చేలా సోషల్ మీడియా అటాకింగ్‌ ఉందంటున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలపై వచ్చే పోస్టులపై ఎదురుదాడికి దిగుతూ సమాధానం ఇస్తున్నారట.
https://10tv.in/group-clashes-in-lb-nagar-trs/
రోజుకో పోస్టులతో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు:
పశ్చిమ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే బూతులు తిట్టారని గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు పనిగట్టుకొని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎమ్మెల్యే గారి తిట్ల పురాణం అంటూ షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. మరో ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ కూడా ప్రత్యర్థి వర్గాలు, పార్టీలకు సంబంధం లేని వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యేకు పడటం లేదని పోస్టులు పెట్టారు. తూర్పు ప్రాంతంలో తాజాగా ఒక ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూప్‌లో ఒక వ్యక్తిని ఇతర దేశంలో ఉండి వాట్సాప్‌లో పోస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది రా? అనే పోస్ట్ చేయడం కూడా వైరల్ అయింది. తర్వాత సదరు ఎమ్మెల్యే ఆ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఇలా రోజుకో పోస్టులతో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

ఎమ్మెల్యేలకు సంబంధం లేని విషయాలను కూడా వైరల్ చేస్తున్నారు:
లేనిపోని విషయాలను వైరల్ చేస్తున్నారని, భూ కబ్జాలను, అనుచరుల బాగోతాలను, ఎమ్మెల్యేలకు సంబంధం లేని విషయాలను కూడా వైరల్ చేస్తున్నారని టాక్‌. ఎమ్మెల్యేల అనుచరుల ప్రవర్తన కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఉంటున్నాయని పార్టీలోనే కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి విషయంలో ఎమ్మెల్యేల‌ అనుచరులు తలదూర్చడం, భూ, ఇసుక దందాలతో సంబంధాలు ఉండటంతో వాటిని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని అంటున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలపై పోస్టులతో రాద్ధాంతం సృష్టిస్తున్నారు.




పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు:
ఈ పోస్టులపై ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని చోట్ల ఫిర్యాదులు కూడా ఇచ్చారు. కొన్ని ప్రాంతాలలో సదరు సోషల్ మీడియాలో పోస్టింగులు చేసే వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. కేసులను సైతం లెక్క చేయకుండా అదే పద్ధతిలో సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఎమ్మెల్యేలపై, అధికార పార్టీ నాయకులపై పోస్టులు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఈ పోస్టులు ఎమ్మెల్యేలకు చిక్కులు తెస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.