గ్రేటర్ పీఠం గెల్చిన టీఆర్ఎస్‌కు కొత్త చిక్కు? బీజేపీకి బ్రహ్మాస్త్రం దొరికిందా?

గ్రేటర్ పీఠం గెల్చిన టీఆర్ఎస్‌కు కొత్త చిక్కు? బీజేపీకి బ్రహ్మాస్త్రం దొరికిందా?

new problem for trs: తెలంగాణలో టీఆర్ఎస్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాం అనే ఆనందం కంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలే ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం ఇచ్చిన ట్విస్ట్ కమలదళానికి బ్రహ్మాస్త్రంగా మారనుందా? టీఆర్ఎస్ వెన్నాడుతున్న ఆందోళన ఏంటి? బీజేపీకి చిక్కిన ఆ అస్త్రం ఏంటి?

జీహెచ్ఎంసీ మేయర్ ఎవరన్నది తేలిపోయింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పట్టికీ ఎంచకాన్ని టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ మద్దతుతో మేయర్ గా గద్వాల విజయలక్ష్మి గెలిచేశారు. అయితే బయటకు చెబుతున్నట్టుగా ఇదేమీ అనూహ్యంగా జరిగిన పరిణామం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ తతంగం అంతా నడిచిందని అంటున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ పొత్తులోనే ఉన్నాయని తొలి నుంచి ప్రచారం చేస్తున్న బీజేపీకి ఇదొక అస్త్రంగా మారబోతోందని చెబుతున్నారు.

నిజానికి గ్రేటర్ ఎన్నికల ప్రచారం సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం.. ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకున్నాయి. కానీ, బీజేపీ మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటేనని, లోపాయికారి ఒప్పందాలతో నడుచుకుంటున్నాయని ఆరోపించింది. వీలు చిక్కిన ప్రతీసారి టీఆర్ఎస్, ఎంఐఎంలు పొత్తులోనే ఉన్నాయని విమర్శలు గుప్పించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం, ఎంఐఎంతో మాకు పొత్తేంటి? అంత సీన్ లేదని కొట్టిపారేస్తూ వచ్చారు. అసలు తమకు ఎంఐఎంతో పొసగదని.. ఆ పార్టీని ఉద్దేశించి పలుమార్లు విమర్శలు కూడా చేశారు.

ఎంఐఎం ప్రధాన నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు కూడా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పలు సవాళ్లు విసిరారు. దమ్ముంటే ఓల్డ్ సిటీలోకి అడుగు పెట్టాలని, అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ చాలెంజ్ లు చేశారు. ఈ స్థాయిలో మాటల యుద్దం జరిగినప్పటికీ, టీఆర్ఎస్-ఎంఐఎం ఒక్కటేనని బీజేపీ విమర్శలు చేసింది. అలా వాడీవేడిగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు అనే చర్చలు మొదలయ్యాయి.

బీజేపీ, ఎంఐంలు కలిసే అవకాశం లేదు. దీంతో టీఆర్ఎస్-ఎంఐఎంలు కలుస్తాయని అందరూ భావించినా, తమకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవంటూ రెండు పార్టీల నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. ఈలోపు జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియడం, కొత్త పాలక మండలి సమావేశం ఏర్పాటు, మేయర్ ఎన్నికకు సమయం ఆసన్నమైపోయింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉండగా, మేయర్ పదవి కోసం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు పోటీ పడుతున్నాయని ప్రచారం జరిగింది.

ముఖ్యంగా మేయర్ పదవి కోసం ఎంఐఎం కూడా సిద్ధం అవుతోందని చెప్పినా, ఆఖరి నిమిషంలో ట్విస్ట్. ఆ పార్టీ పోటీ చేయకుండా టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని బలపరచడంతో, బీజేపీ నేతలు అవాక్కయ్యారు. ఈ వ్యవహారమే ఇప్పుడు టీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. మొదట్నుంచి టీఆర్ఎస్-ఎంఐఎం ఒక్కటే అని చెబుతూ వచ్చిన బీజేపీకి.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ఓ దివ్యాస్త్రం దొరికినట్టు అయిందంటున్నారు. టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు దీన్ని బాగా ఉపయోగించుకోవాలని కమలనాథులు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పాగా వేయడానికి ఇప్పటినుంచే బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్-ఎంఐఎం బంధాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు. మేయర్ ఎన్నికల సమయంలో ఎంఐఎం మద్దతు తీసుకోవడం వల్ల తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తమ ప్రమేయం లేకుండానే ఎంఐఎం అనూహ్యంగా తమకు మద్దతిచ్చిందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.

తమకు డిప్యూటీ మేయర్ పదవిని టీఆర్ఎస్ ఆఫర్ చేసిందని, తామే వద్దని చెప్పామని ఎంఐఎం నేతలు చెబుతుండటంతో, టీఆర్ఎస్ చేస్తున్న కవరింగ్ బెడిసికొట్టినట్టైంది. ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే జరిగిందని బీజేపీ చెబుతూ హిందువుల ఓట్లను పోలరైజ్ చేసుకోవాలని పెద్ద వ్యూహంతోనే సిద్ధంగా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దీన్నే ప్రధాన అస్త్రంగా వాడుకుని లబ్ది పొందే వీలుందనే అంచనాలు ఉన్నాయి. ఎంఐఎం మద్దతుతో మేయర్ పదవిని పొందకుండా ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు టీఆర్ఎస్ పార్టీలో కూడా వినిపిస్తున్నాయి.

ఇంత తతంగం జరిగిన తర్వాత తమ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని టీఆర్ఎస్ పార్టీ ఎంత చెప్పినా జనం అంత ఈజీగా నమ్మకపోవచ్చు అనే వాదనలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టేశారు. ముందు నుంచి ఎంఐఎం పార్టీతో అవగాహనతో పని చేయడం వల్లే టీఆర్ఎస్ కు 56 సీట్లు అయినా వచ్చాయని కమలనాథులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలూ ఒప్పందంతో పని చేయకుంటే తామే మేయర్ పీఠం గెలుచుకునే వాళ్లమని చెబుతున్నారు. ఎంఐఎం మద్దతు తీసుకోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి పదునైన అస్త్రాన్ని అందించినట్టు అయ్యిందని గులాబీ శ్రేణులు లబోదిబోమంటున్నాయి.