Malla Reddy IT Raids : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం.. క్యాసినోతో లింక్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

Malla Reddy IT Raids : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల్లో కొత్త కోణం.. క్యాసినోతో లింక్

Malla Reddy IT Raids : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. గతంలో చీకోటి ప్రవీణ్ తో కలిసి క్యాసినో వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడు జైకిషన్. మల్లారెడ్డి సీఎంఆర్ స్కూల్ పార్టనర్ గా జైకిషన్ తండ్రి నర్సింహ యాదవ్ ఉన్నారు. దీంతో జైకిషన్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నాయి ఐటీ బృందాలు.

కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు, విచారణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస దాడులతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. తాజాగా మంగళవారం మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, ఆయన అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులు నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతుండటం కలకలం రేపింది. దాదాపు 50 బృందాలు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దాడులు కొనసాగిస్తున్నారు.

మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక యూనివర్సిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్ లో ఉన్న క్రాంతి బ్యాంక్ లో జరిగినట్టుగా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఏకంగా రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఈ ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు.

మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈడీ, ఐటీ దాడులను ఎలా తిప్పికొట్టాలనే దానిపై చర్చలు జరిపారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు చెందిన ఒక కీలక నేతకు ఈడీ నోటీసులు రావచ్చని, హైదరాబాద్ లోని కొందరు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు రావచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈడీ, ఐటీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టే అంశంపై కూడా వీరు చర్చించారు.