కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం.. నిందితులు ముగ్గురూ మైనర్లే, అమ్మాయిని ఎలా అనుమతించారు, వెలుగులోకి OYO ఆనంద ఇన్‌ హోటల్‌ నిర్వాకం

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 01:45 PM IST
కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం.. నిందితులు ముగ్గురూ మైనర్లే, అమ్మాయిని ఎలా అనుమతించారు, వెలుగులోకి OYO ఆనంద ఇన్‌ హోటల్‌ నిర్వాకం

kukatpally girl gang rape case: సంచలనం రేపిన హైదరాబాద్ కూకట్‌పల్లి అత్యాచారం ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓయో(oyo) హోటల్‌ నిర్వాకం బయటపడుతోంది. మైనర్లకు రూమ్‌ ఇవ్వకూడదన్న నిబంధనలున్నా హోటల్‌ సిబ్బంది పట్టించుకోలేదు. డిగ్రీ స్టూడెంట్‌పై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లకు ప్రత్యేక గదిని కేటాయించారు. ముగ్గురు మైనర్లతో పాటు ఓ యువతి ఉన్నా హోటల్‌ నిర్వాహకులు ప్రశ్నించలేదని తెలుస్తోంది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆనంద ఇన్ హోటల్:
కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్(hotel ananda inn)‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి గదులు కేటాయిస్తారని ఫైరవుతున్నారు. 10టీవీ సిబ్బంది హోటల్‌లో ఉండగానే ఓ జంట పరారు కావడం… హోటల్‌ నిర్వాహాకుల అక్రమాలకు అద్దం పడుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు రూమ్:
కూకట్‌పల్లి అత్యాచార ఘటనకు సంబంధించి హోటల్‌ నిర్వాకం బయటకు వస్తోంది. అత్యాచారం జరిగిన హోటల్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు… సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. హోటల్‌ నిర్వాహాకులు నిబంధనలకు అడుగడుగునా తూట్లు పొడిచినట్లు గుర్తించారు. మైనర్లకు రూమ్‌ ఇవ్వకూడదని నిబంధనలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. సాధారణంగా హోటల్‌ రూమ్ ఇచ్చేటప్పుడు ఐడీ కార్డులు జిరాక్స్ తీసుకుంటారు. అలా తీసుకున్న సమయంలో వారు మైనర్లని ఖచ్చితంగా తెలుస్తుంది.

హోటల్ గదిలో ముగ్గురికి మించి ఉండకూడదు, అమ్మాయిని ఎలా అనుమతించారు:
దీన్నిబట్టి హోటల్‌ సిబ్బంది ఐడీ కార్డులు తీసుకోకపోయి అన్నా ఉండాలి. లేదా మైనర్లని గుర్తించినా పట్టించుకోకపోయి ఉండాలి. దీనికి తోడు హోటల్‌ గదిలో ముగ్గురికి మించి ఉండకూడదు. కానీ అమ్మాయితో కలసి గదిలోకి నలుగురు వెళ్లారు. అలాంటప్పుడన్నా హోటల్‌ సిబ్బంది ప్రశ్నించాలి. కానీ పట్టించుకోలేదని అర్థమవుతోంది. పైగా అన్ని గంటలు ఓ గదిలో ఉన్నప్పుడైనా సిబ్బందికి అనుమానం రావాలి. కానీ హోటల్‌ సిబ్బంది అదేమీ పట్టించుకోలేదు.

ఎవరి పేరుతో రూమ్ బుక్ చేశారు, ఎలాంటి గుర్తింపు పత్రాలు తీసుకున్నారు?
మరోవైపు విద్యార్థిని రేప్‌ కేసులో కూకట్‌పల్లి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అత్యాచారం జరిగిన హోటల్‌ను పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. హోటల్‌ సిబ్బంది, మేనేజర్‌ను ప్రశ్నించారు. ఎవరి పేరుతో రూమ్‌ బుక్‌ చేశారు, ఎలాంటి గుర్తింపు పత్రాలు ఇచ్చారో ఆరా తీశారు. హోటల్‌లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.

నిందితులు ముగ్గురూ మైనర్లే:
విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితులు మైనర్లే అని తేలింది. స్నేహం ముసుగులో విద్యార్థినిపై కొన్ని రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. జూబ్లిహిల్స్‌లో ఉండే అమ్మాయి సికింద్రాబాద్‌లోని కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఆమె ఇంటికి సమీపంలో ఉండే ముగ్గురు విద్యార్థులు ఆమెతో స్నేహం చేశారు. కాలేజీలో ఫీజు కట్టేందుకు వెళ్లిన సమయంలో ఆమెకు ఫోన్ చేసిన ఆ ముగ్గురు.. బర్త్‌డే పార్టీ అని చెప్పి బయటకు తీసుకెళ్లారు.

బర్త్ డే పార్టీ పేరుతో గ్యాంగ్ రేప్:
కాసేపు ట్యాంక్‌బండ్‌ బుద్ధవిగ్రహం దగ్గర మాట్లాడుకున్నారు. కేక్‌ కట్‌ చేసి పార్టీ చేసుకుందాం అంటూ కూకట్‌పల్లిలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లారు. కేక్‌ తీసుకొస్తానంటూ వెళ్లిన ఓ విద్యార్థి ముందుగా అనుకున్న పథకం ప్రకారం దానిపై మత్తుమందు చల్లాడు. నువ్వే గెస్ట్‌ ముందు నీకే అంటూ కేక్‌ ఆమెకు తినిపించారు. ఆమె స్పృహ తప్పగానే అత్యాచారం చేశారు. తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆటోలో ఇంటికి పంపారు. అమ్మాయి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.