News Update : 20 వార్తలు, సంక్షిప్తంగా..

News Update, 20 వార్తలు, సంక్షిప్తంగా

News Update : 20 వార్తలు, సంక్షిప్తంగా..

News

News Update
1. Tirumala Tirupati : ఆదాయమే లేని కంపెనీ..రూ. 300 కోట్లు ఎలా ఇస్తుంది ? :-

టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానన్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై 10టీవీ చేసిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఐటీ పార్కులు, సెజ్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హైక్లాస్ విల్లాలు అంటూ భారీగా ప్రాజెక్టులు చేపట్టామన్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌ మాటలు వట్టిమాటలనే తేలిపోయింది. లక్ష రూపాయల మూలధనం, లక్ష లోపు ఆదాయం, కేవలం 26 వేల 634 రూపాయల నికర విలువ మాత్రమే ఉందని 10 టీవీ పరిశోధనలో బయటపడింది. ఆదాయమే లేని కంపెనీ .. ఏకంగా తిరుపతిలో 300 కోట్ల రూపాయల విరాళం ఇస్తామంటే టీటీడీ ఎలా నమ్మింది.. 10 ఎకరాల స్థలం ఎలా ఇస్తామంది..? అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

టీటీడీతో MOU కుదుర్చుకున్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డులో ఇటీవల జరిగిన మార్పులు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి 4న యుగంధర్‌ సంపత్ కుమార్‌ శాఖమూరి, శివచంద్రయాదవ్‌, హస్తిముల్‌ చోర్డియా, గులాంనబీ మన్సూరి అడిషనల్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. వీరిలో యుగంధర్‌ సంపత్ కుమార్‌ శాఖమూరి తెలుగు వ్యక్తి. ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కేదార్ నాథ్‌ సింగ్‌కూ.. యుగంధర్‌కు ఏమైనా డీల్ కుదిరిందా..? సంజయ్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌ను తిరుమలకు తీసుకొచ్చింది కూడా యుగంధరేనా..? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

లక్ష రూపాయల మూలధనం ఉన్న ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ 300కోట్ల విరాళం ఇవ్వగలదా అన్న అంశంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. ఉద్వేగ్ ఇన్‌ఫ్రా ఆర్ధిక స్ధితిగతులపై ఆరా తీయాలని విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 300 పడకల పిల్లల ఆసుపత్రిని కట్టాలని గతంలోనే నిర్ణయించినట్లు చెప్పారు. ఆసుపత్రికి అయ్యే ఖర్చును ఉద్వేగ్ ఇన్‌ఫ్రా డైరెక్టర్ సంజయ్ సింగ్ భరించేందుకు ముందుకు వచ్చారని.. విరాళం ఇస్తానని వచ్చినప్పుడు అవకాశం ఇవ్వాలని భావించామన్నారు. ఉద్వేగ్ ఇన్‌ఫ్రా విరాళం ఇచ్చినా ఇవ్వకపోయినా.. పిల్లల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

2. ఏపీలో కార్పొరేషన్, మున్సిపాల్టీ ఫలితాలు :-
ఏపీలో 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల ఫలితాలు 2021, మార్చి 14వ తేదీ ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 8 గంటలకు ఏజెంట్ల ముందు బ్యాలెట్‌ బాక్సుల సీల్‌ ఓపెన్‌ చేయనున్నారు. అనంతరం బ్యాలెట్‌ పత్రాలన్నీ కుప్పలుగా పోసి.. పార్టీల వారిగా కట్టలు కట్టనున్నారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2 వేల 204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 18 వందల 22 టేబుళ్లు.. మొత్తం 4 వేల 26 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కార్పోరేషన్‌లలో కౌంటింగ్‌కు 2 వేల 376 మంది సూపర్ వైజర్లు, -7వేల 412 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించింది ఎస్‌ఈసీ. మున్సిపాలిటీలలో 19 వందల 41 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 5 వేల195 కౌంటింగ్ స్టాఫ్ సిబ్బందిని నియమించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20 వేల 419 పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర గొడవ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ విధించారు. ఫలితాలన్నీ వచ్చాక ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు.

3. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ :-
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి 93మంది బరిలో ఉన్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరు జిల్లాల పరిధిలో.. 10 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఈ ఎన్నికలను అన్నిపార్టీలతో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..ఓటర్లకు కొత్త పద్ధతుల్లో గాలం వేస్తున్నారు అభ్యర్థులు. కొందరు అభ్యర్థులు క్యాస్ట్ కార్డ్‌ వాడుతుంటే .. మరికొందరు నెట్ క్యాష్ ఇస్తున్నట్టు సమాచారం. కొందరు అభ్యర్థులైతే ఒక్కో ఓటుకు 2 వేల నుంచి 5 వేల మధ్య ముట్టచెప్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంకొందరైతే డబ్బును ఆన్‌లైన్‌లో పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న చోట వైన్‌ షాపులు బంద్‌ ఉన్నప్పటికీ ఓటర్లకు లిక్కర్ బాటిళ్లు అందుతున్నాయి. మహిళా పట్టభద్రులకు స్వీటు బాక్సులు, కొత్త ఓటర్లకు క్రికెట్‌ కిట్లు.. వ్యవసాయ పనులు చేసుకుంటున్న పట్టభద్రులకు మేకలు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పార్టీ నేత డబ్బులు పంచి గెలుస్తామని బహిరంగంగా చెప్పడం కలకలం సృష్టించింది. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఇంతపెద్దమొత్తంలో ప్రలోభాలకు గురిచేయడం ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు.

4. పోల్ మేనేజ్ మెంట్..ఒక్కో పార్టీ ఒక్కో విధానం : –
గ్రాడ్యుయేట్స్ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అవలంభిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామంటూ బీజేపీ గ్రాడ్యుయేట్ ఓట్లకు గాలం వేసింది. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి స్థానంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ మండలి సభ్యుడు కావడంతో మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు తహతహలాడుతుంది. ఇక వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం స్థానానికి పోటీ చేస్తున్న ప్రేమేందర్‌ రెడ్డి ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ పట్టభద్రులను వేడుకున్నారు.

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి స్థానంలో అనూహ్యంగా పోటీకి దిగిన మాజీ ప్రధాని పీవీ కూతురు తన తండ్రి ఇమేజ్‌ను అధికార పార్టీ చేసిన అభివృద్ధిని నమ్ముకుని పట్టభద్రుల ముందుకెళ్లారు. ఆమెను గెలిపించేందుకు మంత్రులు రంగంలోకి దిగి పోల్‌ మేనేజ్‌ మెంట్ చేస్తున్నారు. మరోవైపు వరంగల్ – ఖమ్మం-నల్లగొండ సిట్టింగ్‌ స్థానంలో ఉన్న పల్లా రాజేశ్వర్‌ కూడా మరోసారి గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు..ప్రైవేట్‌ టీచర్లు, గ్రాడ్యుయేట్లను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను అవలంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్‌లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, వరంగల్‌లో రాములు నాయక్‌ బరిలో ఉన్నారు. కరీంనగర్‌లో కలిసి వచ్చిన విధంగానే.. ఈ స్థానాల్లోనూ గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది.

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ బరిలో ఉన్నారు.. బీసీ మంత్రాన్నే నమ్ముకుని గ్రాడ్యేయేట్ల ముందుకు వెళ్లారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్, వరంగల్‌లో ప్రొఫెసర్‌ కోదండరాం స్వతంత్ర అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

5. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : –
ఆంధ్రప్రదేశ్‌లో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. కృష్ణా -గుంటూరులో 19 మంది పోటీలో ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి 13 వేల 350 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తక్కువగా ఉండటంతో వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు అభ్యర్థులు. డబ్బు, మద్యం, గిఫ్ట్ లతో ఎర వేస్తున్నారు. ఓటుకు 4 వేలకు తక్కువ కాకుండా పంచుతున్నారు.

ఎన్నికల అధికారుల నిఘాకు చిక్కకుండా కొందరు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. వారికి ఏం కావాలో అడిగి మరీ అప్పటికప్పుడు కొనుగోలు చేసి ఇస్తున్నారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ప్రలోభాలకు గురిచేయడం మేధావులను విస్మయానికి గురిచేస్తుంది. నాన్‌ టీచింగ్ స్టాఫ్‌ వాళ్లు ఎక్కువ మంది బరిలో ఉన్నారని వారే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

6. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ కసరత్తు :-
తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ కసరత్తు కొలిక్కి వస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్‌ దాసరి శ్రీనివాసులు పేరు దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. గత ఐదు నెలలుగా తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన బీజేపీ నాయకత్వం… దాసరి శ్రీనివాసులు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో విజయవాడలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు హాజరైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌ఛార్జ్‌ సునీల్ దియోధర్.. తిరుపతి అభ్యర్థిపై సుదీర్ఘ మంతనాలు జరిపారు.

ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బీజేపీ-జనసేన అభ్యర్ధిని ప్రకటిస్తామన్నారు. టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు..కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు సునీల్‌ దియోధర్. గత కొంతకాలంగా తిరుపతిలో ఎవరు పోటీ చేయాలన్న విషయంపై బీజేపీ-జనసేన మధ్య చర్చోపచర్చలు జరిగాయి. తిరుపతి అభివృద్ధి, రాష్ట్ర మేలు కోసం బీజేపీ అభ్యర్థినే నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. దీంతో అభ్యర్థిని ఫైనల్‌ చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

7. కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి
అనంతపురం జిల్లాలో కలెక్టర్‌ గంధం చంద్రుడికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం ముదురింది. కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం జిల్లాలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. చేతకాని, పనికిరాని కలెక్టర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్‌ లెక్కచేయట్లేదని విమర్శించారు. సీఎంవో, మంత్రులకు కలెక్టర్‌ రాంగ్‌ ఫీడింగ్‌ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కలెక్టర్ చేసిన పిచ్చి పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. త్వరలోనే కలెక్టర్‌ గంధం చంద్రుడిపై సీఎంకి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

తాడిమర్రి మండలం చిలవారిపల్లి గ్రామంలో ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామం వారు కాటమయ్య స్వామి ఊరేగింపు చేస్తు వస్తుంటారు. అలాంటిది ఈ సారి కలెక్టర్ గంధం చంద్రుడు ఈవిషయంలో జోక్యం చేసుకొని ఇద్దరి మద్య చిచ్చు పెట్టారన్నారన్నారు. కలెక్టర్ వల్లే కలత చెందిన బాలరెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. అనంతపురములోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరెడ్డిని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించారు. కలెక్టర్ చేతకాని తనం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందని కేతిరెడ్డి దుయ్యబట్టారు.

8. విశాఖ స్టీల్ ప్లాంట్..గంటా శ్రీనివాసరావు : –
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పార్టీలూ ఏకతాటిపైకి రావాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 25 మంది ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామాల విషయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గంటా ఆరోపించారు. చివరి అస్త్రం సంధించాల్సిన సమయం ఇదేనని, ఇప్పుడు కాకపోతే పోరాడేందుకు ఇక ఏమీ ఉండదన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌…భయంతో కేంద్రానికి లొంగిపోయారని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నామని బీజేపీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందు పెట్టి ఏపీలో అధికార పార్టీ వైసీపీ…మతమార్పిడులు చేస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి మద్దతు పలికినందుకు కృతజ్ఞతగా మెగాస్టార్ చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్మికులు.

9. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, బీజేపీ కసరత్తు :-
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావుతో భేటీ అయ్యారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. సభ సాక్షిగా కేంద్రం తెలంగాణకు ఇచ్చిందెంత? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందెంత లెక్కలతో సభలో చెప్పాలన్నారు. భైంసా అల్లర్లు, నిరుద్యోగభృతి, పీఆర్సీ అంశాలు సభలో లేవనెత్తాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సభలో ఎండగడుతామన్నారు ఎమ్మెల్యేలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ పథకానికి నిలిచిపోయాయో సమాధానం రాబడుతామన్నారు. ప్రజలు, సభ్యుల హక్కుల కోసం సభలో కొట్లాడతామన్నారు ఎమ్మెల్యేలు.

గతంలో బీజేపీకి రాజాసింగ్‌ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకి చేరింది. బడ్జెట్ సమావేశాల్లో తమకు కేటాయించే సమయాన్ని సద్వినియోగం చేసుకునంటామని.. ప్రజా సమస్యలపై గళమెత్తామని బీజేపీ స్పష్టం చేసింది. బడ్జెట్‌లో అన్నివర్గాలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

10. భైంసా అల్లర్ల వెనుక :-
నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల వెనుక ఎవ‌రున్నా, ఎంత‌టి వారైనా ఉపేక్షించేది లేదన్నారు న్యాయ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి . ఘర్షణలు చోటుచేసుకున్న మ‌హాగావ్ గ్రామంతో పాటు భైంసా ప‌ట్టణంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యటించిన ఇంద్రకరణ్‌ బాధితులను పరామర్శించారు. అల్లర్లలో గాయపడ్డ వారికి, ఆస్తినష్టం జరిగిన వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. అధైర్యపడవద్దని బాధిత కుటుంబాల‌కు భరోసా నిచ్చారు.

భైంసా ప‌ట్టణాన్ని, ప్రజలను ఈ స్థితిలో చూడడం బాధ కలిగిస్తోందన్నారు ఇంద్రకరణ్‌ రెడ్డి. జ‌నజీవ‌నం స్తంభించ‌డంతో కూలీ నాలీ చేసుకునే వారు ఇబ్బందులు ప‌డుతున్నారన్నారు. అల్లర్ల వల్ల సామాన్య, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌లు, చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోతున్నారని ఆందోళ‌న వ్యక్తం చేశారు. వ‌రుస సంఘ‌ట‌నల వ‌ల్ల భైంసా అభివృద్ది కుంటుప‌డుతుంద‌ని, దీని ప్రభావం చుట్టుప్రక్కల ప్రాంతాల‌పై ప‌డుతుంద‌ని ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా రాజ‌కీయాల‌కు అతీతంగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి. కొన్నిపార్టీలు ఇలాంటి సంఘ‌ట‌న‌లు నుంచి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భైంసా ఘటనపై స‌మ‌గ్ర దర్యాప్తు జ‌రుగుతుంద‌ని, దీని వెన‌క ఎవ‌రు ఉన్నారో ద‌ర్యాప్తులో తేలుతుంద‌ని స్పష్టం చేశారు. పోలీసుల‌కు పూర్తి స్వేచ్చనిచ్చామ‌ని, నిందితులు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. జ‌ర్నలిస్టులపై దాడి జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు ఇంద్రకరణ్‌ రెడ్డి.

11. వ్యాక్సినేషన్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : –
వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునేందుకు అనుమతించింది ఏపీ వైద్య ఆరోగ్యశాఖ. 60 ఏళ్లు దాటిన వారు ఏదైనా ధ్రువపత్రం చూపించి టీకా వేయించుకోవచ్చు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్య ధ్రువీకరణ పత్రంతో టీకా పొందవచ్చు. వైద్య ధ్రువీకరణ పత్రం లేకున్నా ఇతర ఆధారాలు చూపితే వ్యాక్సినేషన్‌ తీసుకోవచ్చు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా టీకా పొందవచ్చు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఏ వ్యాక్సినేషన్‌ కేంద్రానికైనా వెళ్లి టీకా తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.

కొవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకున్న వారికే ఇప్పటి వరకు కరోనా టీకా వేస్తున్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో 8.39లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గేసరికి చాలామందిలో భయం పోయింది. అసలు కరోనా లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ అజాగ్రత్తే మరోసారి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్రజలు కచ్చితంగా మాస్క్‌ ధరంచాలని.. భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహారాష్ట్రలో వచ్చిన పరిస్థితే ఏపీలోనూ వచ్చే ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

12. భారత్ లో కరోనా పంజా : –
భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 24వేల 882 కేసులు నమోదయ్యాయి. 140 మంది చనిపోయారు. కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. నాలుగు రోజల క్రితం 20 వేలు దాటిన కరోనా కేసులు నిన్న 23 వేలకు పైగా నమోదయ్యాయి. గత ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు దాకా దేశవ్యాప్తంగా భారీగా నమోదయిన కరోనా కేసులు తర్వాత తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో సెప్టెంబరు నుంచి కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 15 రోజుల నుంచీ పరిస్థితి మళ్లీ మారిపోయింది. వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తి ఊహించని రీతిలో పెరుగుతోంది. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొత్త కేసుల్లో 65శాతం మహారాష్ట్రలో నమోదైనవే.

తాజాగా రాష్ట్రంలో 15వేల 817 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా ఉంది. ముంబై, పూణె, నాగ్‌పూర్, థానే, అమరావతిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. కేసులు తగ్గకపోతే…రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోనూ కరోనా కలవరం కలిగిస్తోంది. కొత్తగా 216 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఇటీవల కాలంలో ఒకేరోజులో 200కు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటీ 13లక్షల 33వేల 728కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని కోటీ 9లక్షల 73వేల 260 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల రెండు వేల22గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి లక్ష 58వేఉల 446 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు.

13. అధికారం మాదేనంటున్న డీఎంకే : –
తమిళనాడులో ఈసారి అధికారంలోకి వచ్చితీరుతామంటున్న డీఎంకే.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా 500 హామీలను గుప్పించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలపై హామీల జల్లు కురిపించింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 4 రూపాయలు ధర తగ్గిస్తామని ప్రకటించింది. గ్యాస్‌ సిలిండర్‌పై వంద రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది.

మొత్తం 500 హామీలతో చెన్నైలో మ్యానిఫెస్టో విడుదల చేశారు స్టాలిన్. అన్నాడీంఎంకేను ధీటుగా ఎదుర్కొనేందుకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. దీదీ తరహాలో బీజేపీని హిందుత్వ కార్డుతో ఎదుర్కొనే వ్యూహం రచించారు. గత పదేళ్లగా తమిళనాడును పట్టి కుదిపేసిన నీట్ వంటి సమస్యలకు తాము అధికారంలోకి వస్తే పరిష్కారాలు చూపిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. అమ్మ క్యాంటిన్లకు పోటీగా కలైంజర్ క్యాంటిన్లు, హిందూ ఆలయాల నిర్వహణకు వెయ్యికోట్ల కేటాయింపు వంటి హామీలు గుప్పించారు స్టాలిన్.

నాస్తికవాద ద్రవిడ పార్టీగా ముద్ర ఉన్న డీఎంకే మ్యానిఫెస్టోలో ఆలయాలకు, చర్చిలకు, మసీదులకు నిధులు ఇస్తామని ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. డీఎంకే మ్యానిఫెస్టోపై ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో డీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు స్టాలిన్స్ సెవన్ ప్రామిసెస్ నినాదం రూపొందించారు..ప్రశాంత్ కిషోర్.

14. ఢిల్లీలో రైతుల ఆందోళన : –
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లోనే శాశ్వతంగా మకాం వేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరాటం ఆగదన్న రైతులు టిక్రీ సరిహద్దులో 25ఇళ్లను నిర్మించారు. రాబోయే రోజుల్లో వెయ్యి నుంచి 2వేల ఇళ్లను నిర్మిస్తామన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న రైతులు.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. దిల్లీ-హరియాణా మార్గంలోని టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లు కట్టుకుంటున్నారు. టిక్రీతో పాటు ఇతర సరిహద్దుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గతేడాది నవంబరు నుంచి రైతన్నలు దిల్లీ శివారుల్లో బైఠాయించారు. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. చట్టాలను కొంతకాలం పాటు నిలిపివేస్తామని, వాటిల్లో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే రైతులు మాత్రం ఇందుకు అంగీకరించట్లేదు. పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా ఉద్యమం విరమించేది లేదని కరాఖండీగా చెప్పారు. మార్చి 26 నాటికి ఆందోళన చేపట్టి నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.

15. యుమునా నది కాలుష్యం :-
లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛంగా కనిపించిన యమునానది.. ఏడాది తిరిగేలోగా మళ్లీ కాలుష్య కాసారంగా మారింది. ఢిల్లీలో నురగలు కక్కుతూ ప్రవహిస్తూ.. డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీలోని వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకి విడుదల చేయడంతో నీరంతా కాల్యుష్యం అయింది. రసాయన వ్యర్థాల వల్ల నీరు విషతుల్యంగా మారుతోంది. నీటిపై తెల్లటి విషపు నురగలు పేరుకుపోయాయి. కెమికల్స్‌ వచ్చి నదిలో కలవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో యమున నదిలో జీవించే జంతువుల ప్రాణాలకు సంకటంగా మారుతుందంటున్నారు. కుంజ్ ఏరియాలో నీటిపై విష‌పు నురగ‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛందంగా మారిన యమునా నది మళ్లీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి ఫ్యాక్టరీలు. ప్రజల బాధ్యతారాహిత్యమే కారణమని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

16. మయన్మార్ లో సైనిక తిరుగుబాటు : –
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆంగ్‌సాన్‌ సూకీని విడుదల చేయాలని .. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటిన దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి వినతిని సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులపై కాల్పులను కొనసాగిస్తోంది. తాజాగా యాంగూన్‌లో పోలీసులు ఉద్యమకారులపై కాల్పులు జరిపారు.

కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నవారిపైనా సైన్యం కర్కషంగా వ్యవహరించింది. వారిని విచక్షణారహితంగా దాడి చేసింది. ఇతర ప్రధాన నగరాల్లో రోడ్లెక్కిన ఆందోళనకారులపై సైన్యం బాష్పవాయు గోళాలు, వాటర్‌ క్యాన్లను ప్రయోగించింది. దొరికిన వారిని దొరికినట్టు జైలు పంపింది సైన్యం. ఆర్మీ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పౌరులపై దాడులను ప్రపంచదేశాలు ఖండించాయి.

మరోవైపు ఆంగ్‌సాన్‌ సూకీపై సైన్యం రోజుకో అవినీతి ఆరోపణ చేస్తుంది. యంగాన్ మాజీ సీఎం నుంచి సైకీ 6 లక్షల డాలర్లను, బంగారాన్ని లంచంగా తీసుకున్నారని ఆర్మీ విమర్శించింది. అటు సూకీ ఆరోగ్యపరిస్థితి ఏంటో తెలియజేయాలని పలు దేశాలు డిమాండ్‌ చేశాయి. సూకీ తాజా వీడియో విడుదల చేయాలంటున్నాయి.

17. శతాబ్ది ఎక్స్ ప్రెస్ దగ్ధం : –
ఢిల్లీ-డెహ్రాడూన్ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ అగ్నికి ఆహుతైంది. ర‌న్నింగ్‌లో ఉన్న రైలు ఉత్తరాఖండ్‌లోని కాన్స్‌రో ఏరియాకు చేరుకోగానే సీ4 బోగీలో మంట‌లు చెల‌రేగాయి. అగ్నిప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంట‌ల‌ను గ‌మ‌నించిన ప్రయాణికులు వెంట‌నే చైన్ లాగ‌డంతో పైలట్ రైలును నిలిపేశాడు. భయంతో ప్రయాణికులు రైలు నుంచి కింద‌కు దూకేశారు. బెర్త్‌లపై పడుకున్న వారిని రైలు నుంచి దింపేశారు తోటి ప్రయాణికులు. ప్రయాణికులు దిగిన కాసేప‌టికే బోగి పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ధమైపోయింది. మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్‌ నుంచి వేరు చేశారు రైల్వే సిబ్బంది. మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారని, ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. పగటిపూట ప్రమాదం జరగడం వల్లే ప్రాణనష్టం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా మెలకువతో ఉండటంతో మంటలను గుర్తించి ట్రైన్‌ను నిలిపివేయడం వల్ల మంటలు పక్కబోగీలకు వ్యాపించలేదన్నారు. రైలును వెంటనే ఆపకపోయినా ప్రమాదస్థాయి పెరిగేదన్నారు. ప్రయాణికులు, లోకో పైలట్ చూపిన సమయ స్ఫూర్తిని రైల్వేశాఖ అభినందించింది. షార్ట్‌ సర్క్యూట్‌కు గల కారణాలపై అధ్యయనం చేస్తున్నామని రైల్వే శాఖ ప్రకటించింది.

18. బీహార్ అసెంబ్లీ రణ రంగం :-
బీహార్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార-విపక్షాలు ఢీ అంటే ఢీ అన్నాయి. బాహాబాహీకి దిగి సభలో గందరగోళం సృష్టించాయి. స్కూలులో మద్యం సేవించారన్న అంశంపై అసెంబ్లీ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మంత్రి రామ్‌సూరత్ రాయ్‌ రాజీనామా చేయాలని, మద్యపానం నిషేధంపై చర్చించాలని ఆర్జేడీ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో ఆర్జేడీ, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటీవ‌ల మంత్రి రామ్‌సూర‌త్ రాయ్ సోద‌రుడి పాఠ‌శాల‌లో భారీగా అక్రమ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి రామ్‌సూర‌త్ రాయ్‌ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని తేజ‌స్వి డిమాండ్ చేయ‌డం అసెంబ్లీలో ర‌భ‌స‌కు కార‌ణ‌మైంది. తేజ‌స్వి డిమాండ్‌పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న సోద‌రుడి పాఠ‌శాల‌లో మ‌ద్యం దొరికితే తానెలా బాధ్యుడిన‌వుతాన‌ని ప్రశ్నించారు, తానెందుకు రాజీనామా చేయాల‌న్నారు. లాలూప్రసాద్ యాద‌వ్ నేరం చేసి జైలుశిక్ష అనుభ‌విస్తున్నాడు కాబ‌ట్టి తేజ‌స్వియాద‌వ్‌ను రాజీనామా చేయ‌మంటే చేస్తారా..? అని నిలదీశారు. తేజ‌స్వి యాద‌వ్‌పై కేసులు ఉన్నందున ఆయ‌న సోద‌రుడు తేజ్‌ప్రతాప్ యాద‌వ్ రాజీనామా చేస్తాడా..? అని మంత్రి మండిప‌డ్డారు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతున్నద‌ని, ద‌ర్యాప్తులో త‌న సోద‌రుడు త‌ప్పు చేసిన‌ట్లు తేలితే జైలుకు పంపిస్తామన్నారు మంత్రి.

19. జో బైడెన్ గుడ్ న్యూస్ : –
భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్‌ సర్కారు తెచ్చిన నిబంధన అమలును మరింత జాప్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మే 14 వరకూ దాని అమలును నిలిపి వేస్తున్నట్లు కార్మిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించే ప్రవాసీయులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. స్వదేశీయులను మెప్పించడానికి ట్రంప్‌ విదేశీ నిపుణులకు కనీస వేతన నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలు వేతనాల భారం తగ్గించుకోవడానికి విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయన్నది ఆయన వాదన. అయితే విదేశీ నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకొనే సంస్థల నుంచి దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరోవైపు ప్రవాసీయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ తాజా ఆదేశాలు వారికి ఊరటనిచ్చాయి.

బైడెన్‌ సర్కారు నిర్ణయాన్ని ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌ సంస్థ వ్యతిరేకించింది. ట్రంప్‌ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిబంధన అమెరికా ఉద్యోగులకు భద్రతనిస్తుందని, దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన వారి కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు హెచ్‌-1బీ వీసాల జారీకి మళ్లీ లాటరీ పద్ధతిని అనుసరిచండం కూడా సరికాదని అంతర్గత భద్రత శాఖకు తెలిపింది

20. ఎవరు మీలో కోటీశ్వరులు : –
ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ… తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయిపోయారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని అత్రుతగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వరులు త్వరలో జెమినీలో ప్రసారం కానుంది. బుల్లితెరపై మరో కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఎన్టీఆర్‌. ప్రజలందరితో మమేకమవ్వడానికి ఎవరు మీలో కోటీశ్వరులు ఉపయోగపడుతుందన్నారు. కొత్త ప్రయాణాన్ని ఆశీర్వదించాలని కోరారు.

నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా తమదైన ముద్ర వేశారన్న ఎన్టీఆర్.. వారిలాగే ఎవరు మీలో కోటీశ్వరులుపై తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తానన్నారు. హోస్ట్‌గా తాను చేయడమే..ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కొత్తదనమన్నారు ఎన్టీరామారావు. గేమ్ ఫార్మాట్ ఒకేలా ఉంటుందన్నారు. హోస్ట్‌గా ఎంత కొత్తగా చేయగలుగుతానన్నదే తనకు ఛాలెంజ్ అన్నారు ఎన్టీఆర్. బాగా చదువుకున్న వాళ్లు, డిగ్రీలు ఉన్నవాళ్లే ఈ గేమ్ ఆడతారన్న భావన తప్పని..నాలెడ్జ్ ఉన్న వాళ్లే ఈ గేమ్ ఆడగలరని ఎన్టీఆర్ అన్నారు. సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్… రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇది సమయం, సందర్భం కాదన్నారు ఎన్టీఆర్.