Night Curfew : కర్ఫ్యూ డేస్…తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ

Night Curfew : కర్ఫ్యూ డేస్…తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ

Night Curfew In Telangana

Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు.  ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ తెలుసు. కరోనా సంక్షోభం నుంచి బయటపడి.. వైరస్ బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అందరికీ తెలుసు. కానీ.. నిర్లక్ష్యం మళ్లీ అందరినీ ముంచేసింది. మనం ఏదైతే కోరుకున్నామో.. అది జరగడం లేదు.

ఏ నైట్ కర్ఫ్యూనైతో చూడొద్దనుకున్నామో… ఇప్పుడు మళ్లీ అందులోకి వచ్చేశాం. ఇంకా.. మాస్కులు పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా, శానిటైజర్లు వాడకుండా.. చేతులు కడుక్కోకుండా ఉంటే.. మనం గట్టిగా వద్దని కోరుకుంటున్న లాక్ డౌన్ కూడా విధించే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తలు.. జాగ్రత్తగా పాటించకపోతే.. మళ్లీ లాక్ డౌన్ తప్పకపోవచ్చు. అప్పుడంతా.. మళ్లీ ఇంట్లో గోడలు చూస్తూనే గడపాల్సి రావొచ్చు.

ఇప్పుడు తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. ఇవాళ్టి నుంచే అది ప్రారంభం కాబోతోంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. మనం ఏదైతో వద్దనుకున్నామో.. ఎలాంటి పరిస్థితులనైతే చూడొద్దనుకున్నామో.. ఇప్పుడు మళ్లీ అక్కడికే వచ్చేశాం. దీనంతటికీ.. జనం అంతులేని నిర్లక్ష్యమే కారణం. జాగ్రత్తలు పాటించపోవడం వల్లే.. మళ్లీ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే.. మనం అసలే వద్దనుకుంటున్న లాక్ డౌన్ కూడా విధించే పరిస్థితులొచ్చేస్తాయ్.

కరోనా ఫస్ట్ వేవ్‌లో కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకున్నాం.. లాక్ డౌన్ ఎత్తేశారని హ్యాపీగా ఫీలయ్యాం. అబ్ నార్మల్ పరిస్థితుల నుంచి.. న్యూ నార్మల్‌కి వచ్చేశామని.. కాస్త తేరుకున్నాం. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

లాక్ డౌన్ లో కష్టాలు అనుభవించిన వాళ్లంతా.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్నారు. ఫస్ట్ వేవ్ నుంచి తేరుకొని.. అంతా ఓకే అనుకుంటున్న టైంలో.. కరోనా సెకండ్ వేవ్ ఊహించని దెబ్బకొట్టింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల కౌంట్.. ఖతర్నాక్ వార్నింగ్ ఇస్తోంది.

ఫస్ట్ వేవ్ ని మించి సెకండ్ వేవ్‌లో కేసులు నమోదవుతున్నాయ్. అప్పుడు వేలల్లో కేసులు రికార్డైతేనే నోరెళ్లబెట్టాం. ఇప్పుడు లక్షలు దాటిపోతున్నాయ్. ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో.. ఇండియా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడేం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. లాక్ డౌన్ ఎత్తేసేముందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు క్లియర్‌గా చెప్పారు.

లాక్ డౌన్ తీసేసినంత మాత్రాన.. వైరస్ తీవ్రత తగ్గిందని కాదు.. జాగ్రత్తలు పాటించకపోతే.. మళ్లీ మహమ్మారి విజృంభిస్తుందని అప్పుడే చెప్పారు. కానీ.. అంతా లైట్ తీసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే.. గేట్లు తీసేసినట్లు.. రోడ్లమీదకొచ్చేశారు. జాగ్రత్తలు పాటించకపోగా.. పార్టీలు, ఫంక్షన్లంటూ.. ఓవరాక్షన్ చేశారు. అందుకే.. ఇప్పుడు కరోనా మళ్లీ యాక్షన్‌లోకి దిగింది. ఇంటర్వెల్ కూడా లేకుండా.. క్లైమాక్స్ రూట్‌లోకి తీసుకెళ్తోంది.

తెలంగాణ వైద్యరోగ్యశాఖ ప్రతి రోజూ హెచ్చరిస్తూనే ఉంది. రాబోయే రెండు నెలలు చాలా కీలకం.. అంతా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు తప్పక పాటించాలి. మాస్క్ వెరీ మస్ట్ అని కూడా చెప్పారు. ధరించని వాళ్లకు ఫైన్లు కూడా వేస్తున్నారు. ఎంత చెప్పినా జనంలో మార్పు లేదు. హెచ్చరించినా.. భయం లేదు. అందుకే.. ఇప్పుడు కర్ఫ్యూ తప్పలేదు. ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే.. అందరికీ వచ్చినట్లేనని కూడా చెప్పారు.

గాలి ద్వారానూ వైరస్ వ్యాపిస్తోందన్నా లెక్క చేయడం లేదు. మాస్కే శ్రీరామరక్ష అని మంత్రి ఈటల రాజేందర్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. మాస్క్ లేకుండా బయట తిరగొద్దన్నా.. చాలా మందిలో మార్పులేదు. కొందరు మాత్రమే కరోనా జాగ్రత్తలు పర్ఫెక్ట్‌గా పాటిస్తున్నారు. పాటించే వాళ్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. జాగ్రత్తలు లైట్ తీసుకున్న వాళ్లతోనే.. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

ఇప్పటికే దేశంలో పరిస్థితులు దిగజారాయ్. రోజురోజుకు.. ఇంకా దారుణంగా తయారవుతున్నాయ్ సిచ్యువేషన్స్. పడిపోతున్న వ్యాక్సిన్ నిల్వలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ల కొరత.. వణుకు పుట్టిస్తున్నాయ్. దేశం మొత్తం మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలోనూ.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ మరో దెబ్బ. ఇది.. కరోనాను మించి సామాన్యులపై ప్రభావం చూపుతుంది.

ఇదంతా.. కేవలం ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే జరిగింది. జనం నిర్లక్ష్యం వల్లే మళ్లీ గతేడాది నాటి పరిస్థితుల్లోకి వచ్చేశాయ్. వెళ్లిపోయిందనుకున్న వైరస్‌ను.. ప్రజల నిర్లక్ష్యం, అజాగ్రత్త.. మళ్లీ రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్‌కమ్ చెప్పాయ్. అందుకే.. వైరస్ అందరికి సోకుతోంది. పల్లెలో ఉన్న సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ఎవ్వరినీ వదలట్లేదు.

తెలంగాణలో.. కరోనా కారణంగా రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులతో.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. కానీ.. పక్క రాష్ట్రాల్లో, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో.. పరిస్థితి ఇక్కడి కంటే దారుణంగా ఉంది. ఇండియా మొత్తాన్ని మహారాష్ట్ర కలవరపెడుతోంది. దేశం మొత్తంలో అక్కడ రికార్డవుతున్న కేసులే అధికం. అందుకే.. వైరస్‌ను కట్టడి చేసేందుకు.. మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు లాక్ డౌన్ విధించింది. కేవలం.. ఎమర్జెన్సీ, మెడికల్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. జనాలను బయటకు రానివ్వడం లేదు.

ఢిల్లీలో కూడా సిచ్యువేషన్ చాలా సీరియస్‌గా ఉంది. లాక్ డౌన్ పెట్టకూడదని సీఎం కేజ్రీవాల్ ఎన్నోసార్లు అనుకున్నారు. లాక్ డౌన్‌తో సాధించేదేమీ లేదని వెనక్కి తగ్గారు. కానీ.. పెరుగుతున్న కేసుల కౌంట్.. రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులతో.. మళ్లీ లాక్ డౌన్ పెట్టక తప్పని సిచ్యువేషన్‌కి తీసుకొచ్చాయ్. ఇష్టం లేకపోయినా.. సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీలో ఆరు  రోజుల లాక్ డౌన్ పెట్టారు.

జార్ఖండ్‌లోనూ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ పెట్టేశారు. ఈ దౌర్భాగ్యానికి.. ప్రజల నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా.. జనం జాగ్రత్తలు పాటించకపోతే.. ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తే.. మనం గట్టిగా వద్దని కోరుకుంటున్న లాక్ డౌన్ మళ్లీ తప్పదు. ఇది మా హెచ్చరిక కాదు.. అందరికీ కలిపి కరోనా ఇస్తున్న కామన్ వార్నింగ్.

నైట్‌ కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. నైట్‌ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు.

నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఉన్నవారు.. తప్పకుండా వారి పనిచేసే ఐడికార్డులను చూపించాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లకు టికెట్ లేకుండా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 30 తర్వాత పరిస్థితిని బట్టి పొడిగింపుపై నిర్ణయం ఉంటుందన్నారు సీపీ సజ్జనార్.

కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వ్యర్థమన్నారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉందని.. ప్రజల వ్యక్తిగత రక్షణే వారికి శ్రీరామరక్ష అన్నారు.