నివార్ తుఫాన్ టెన్షన్ : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 06:39 AM IST
నివార్ తుఫాన్ టెన్షన్ : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Niwar cyclone tension : ఈనెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని, వరదలతో ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.



నివార్‌ తుఫాన్‌ ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో చాటాచోట్ల ఓ మోస్తరు వర్షాలు…. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.



https://10tv.in/cyclone-nivar-heavy-rains-in-chennai-trains-planes-closed/
మరోవైపు…నివార్‌ తుఫాన్‌ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 2.30 మధ్య నివార్‌ తుపాను తీరం దాటినట్టు ఐఎండీ వెల్లడించింది.