కల్వకుంట్ల కవిత ఇక ఎమ్మెల్సీ..నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 09:55 AM IST
కల్వకుంట్ల కవిత ఇక ఎమ్మెల్సీ..నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు

nizamabad mlc : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత..ఇక ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. 14వ తేదీన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు కవిత.



2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభించారు. మొదటి రౌండ్ లోనే ఫలితం వచ్చేసింది. 823 ఓట్లకు గాను..టీఆర్ఎస్ కు 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు వచ్చాయి. 10 ఓట్లు చెల్లలేదు.



ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు చేశారు. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్‌ జరిగింది. రెండు రౌండ్లలో కౌంటింగ్ పక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయగా.. తొలి రౌండ్‌లోనే ఫలితం వెల్లడయ్యింది. ఫలితం ఏకపక్షంగా ఉంటుందని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే ఫలితం రావడంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు.



మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్ల వస్తేనే డిపాజిట్ దక్కనుంది. కౌంటింగ్‌కు ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్ కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించారు. ఆ తర్వాత బ్యాలెట్‌ ద్వారా పోలైన ఓట్లను ఒక్కచోట కుప్పగా పోసి.. 25 ఓట్లకు ఓ కట్టగా కట్టి లెక్కించారు.



నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 824 ఓట్లు ఉండగా… 821 మంది ఓటు వేశారు. ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 99.87 శాతం పోలింగ్ నమోదైంది. ఇక కౌంటింగ్‌కు ఒక్కో పార్టీ నుంచి 8 మందిని మాత్రమే అనుమతించారు. TRS తరపున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ తరపున సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీపడ్డారు. అయితే పోలింగ్ ఏకపక్షంగా జరగడంతో ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనంగా మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.