25వేల ఫోన్ జస్ట్ రూ.499కే, 10వేల పట్టుచీర కేవలం రూ.299కే.. కక్కుర్తి పడి క్లిక్ చేశారో మీ డబ్బు గోవిందా

25వేల ఫోన్ జస్ట్ రూ.499కే, 10వేల పట్టుచీర కేవలం రూ.299కే.. కక్కుర్తి పడి క్లిక్ చేశారో మీ డబ్బు గోవిందా

Online Cheating Be Careful With Offers And Discounts In Online

online cheating: ఎప్పుడైనా.. ఎక్కడున్నా.. మిమ్మల్ని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉంటారు.. మీలోని అమాయకత్వమో, అత్యాశో మీ కొంపలు ముంచేస్తుంది. మీలో ఏ మూలనో ఉన్న అత్యాశలపై వల వేస్తారు. మెయిల్‌ పంపిస్తారు.. లేదా ఫోన్ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించాక.. మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడం వారికంత కష్టం కాదు.. ఆ తర్వాత లబోదిబోమనడం ఒక్కటే మీరు చేసే పని..

25వేల ఫోన్ జస్ట్ రూ.499కే.. 10వేల పట్టుచీర రూ.299కే.. ఆర్డర్ కోసం క్లిక్ చేశారో.. ఖాతా ఖాళీ.. ఆఫర్ల వలలో చిక్కితే అప్పులపాలే

స్మార్ట్‌ఫోన్ ఉచితంగా కావాలంటే లింక్ ఫాలో అవ్వండి అని మెసేజ్ వచ్చిందా:
‘లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉచితంగా, నామమాత్రపు ధరకు కావాలంటే ఈ లింక్‌ ఫాలో అవ్వండి’ అంటూ స్మార్ట్‌ ఫోన్‌లకు ఇటీవల కొన్ని మెసేజ్‌లు వస్తున్నాయి. వాట్సప్‌లలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. వాటిని నమ్మితే నిలువునా మోసపోవడం ఖాయం. ఇప్పటికే పలు రకాలుగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులు ఏ అవకాశాన్ని వదలడం లేదు.

నెట్‌వర్క్‌ ఆఫర్ ముగిసింది, లింక్ క్లిక్ చేయండి అని వచ్చిందా? అయితే జాగ్రత్త
స్మార్ట్‌ఫోన్‌కు వాట్సప్‌లో ఓ మెసేజ్‌ వస్తుంది. మీ నెట్‌వర్క్‌ ఆఫర్‌ ముసిగిపోయిందని, కొనసాగాలంటే కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయాలని దానిలో రాసి ఉంటుంది. అది చూసి నిజమనుకుని క్లిక్‌ చేయగానే సైబర్‌ దొంగలు తమ పని ప్రారంభించేస్తారు. లింక్‌పై క్లిక్‌ చేయగానే పేరేంటి, ఊరేంటి అంటూ అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. అన్నిటికీ సమాధానాలు ఇస్తూ పోతే చివరిగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ కోసం అకౌంట్‌ నెంబర్, పిన్‌ నంబర్‌ నమోదు చేయమంటారు. ఈ వివరాలు పూర్తి చేయగానే మన అకౌంట్‌లో డబ్బులు మాయమైపోతాయి.

రూ.50వేల విలువైన ఫోన్లు రూ.499కే.. ఆలోచించకుండా క్లిక్ చేశారో అంతే..
మరో మెసేజ్‌ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తోంది. షియోమీ, యాపిల్, సామ్‌సంగ్‌ కంపెనీల స్మార్ట్‌ ఫోన్లు రూ.50వేలకు పైగా ఖరీదు గలవి కేవలం రూ.499కే లభిస్తాయని చెబుతారు. అది చూసి అంత తక్కువగా ఎలా ఇస్తారని, దీనిలో ఏదో మోసం ఉందని కూడా ఆలోచించకుండా కొందరు వెంటనే అక్కడ కనిపిస్తున్న వెబ్‌ లింక్‌ను తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరవగానే మళ్లీ అదే కథ..వివరాలు అడగడం, సొమ్ము లాగడం జరిగిపోతుంది.

ఆడవాళ్లను ఆకర్షించేందుకు చీరలపై భారీ డిస్కౌంట్లు:
ఈ మధ్య నేరగాళ్ల తెలివితేటలు మరీ ఎక్కువయ్యాయి. ఆడవాళ్లను ఆకర్షించేందుకు ఏకంగా చీరలపైనా భారీ డిస్కౌంట్లే ఇస్తున్నారు. 10వేల రూపాయల పట్టుచీర కేవలం 499కే.. త్వరపడండి.. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులే అంటే చాలు.. ఆడవాళ్ల సంగతి తెలిసిందే కదా.. పట్టుచీర చాలా తక్కువగా వస్తుందని ఆశపడి ఆర్డర్ చేస్తారు. అంతే, మీ ఖేల్ ఖతం అయినట్టే. సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది. ఆ తర్వాత ఎంత చింతించినా నో యూజ్. ఇలా చీరలు, ఐఫోన్లు, ఇంట్లో వస్తువులంటూ ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నా.. ప్రజల్లో పూర్తి అవగాహన రావడం లేదు.

‘ఉచిత’ మోసాలు నమ్మి మోసపోవద్దు:
ఇలాంటి ‘ఉచిత’ మోసాలు నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లలో అనవసరంగా వివరాలు నమోదు చేస్తే చివరికి డబ్బు పోగొట్టుకుని బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం మాత్రం ఉండటం లేదు. నేరగాళ్ల కొత్త ఆలోచనలకు అమాయక ప్రజలు చిక్కుతూనే ఉన్నారు. జనం జాగ్రత్తగా ఉంటేనే.. వీటిని అరికట్టవచ్చు. లేదంటే.. కొత్త కొత్త దారుల్లో వచ్చే దోపిడీగాళ్లను నిలువరించడం కష్టమైన పనే. సో మీ అకౌంట్ల డబ్బులు మాయం కాకూడదంటే.. అప్రమత్తంగా ఉండాల్సింది మీరే. మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష.