ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ కేసు.. నిందితుల నుంచి కీలక సమాచారం

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ కేసు.. నిందితుల నుంచి కీలక సమాచారం

Online loan apps case : ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ కేసులో సైబర్‌ క్రైమ్ పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు.. మరి కొందరు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కీర్తి అనే ఉద్యోగిని సిమ్‌ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూఎన్‌ యూ కంపెనీ రహస్యాలను రాబట్టారు. చైనా కంపెనీలు ఇప్పటికే వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు ఆధారాలు రాబట్టారు. బెంగుళూరులో ఉండే కాల్‌ సెంటర్‌లో ఉన్న మూడు సిమ్‌ బాక్సులను స్వాదీనం చేసుకున్నారు.

కీర్తి అనే నిర్వాహకురాలి ఆఫీసులో దొరికిన సిమ్‌ బాక్సుల ద్వారా కస్టమర్లను ఏ విధంగా బెదిరించారో తెలుసుకున్నారు. సిమ్ బాక్స్‌లను హైదరాబాద్ తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు.. వాటి కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. వాటి ద్వారా జియాంగ్ నిర్వహించిన U.N.U కంపెనీ ఆర్థిక లావాదేవీలు తెలిసే అవకాశాలున్నాయి. జియాంగ్‌ కనుసన్నల్లో గతేడాది జనవరిలో రుణయాప్‌లు ప్రారంభమైనట్టు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజులకే చైనాకు చెందిన జెన్నిఫర్ సలహాలు సూచనలతో నిందితులు బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఆ కంపెనీకి హెచ్‌ఆర్‌గా కీర్తిని నియమించారు నిందితులు. మూడు వందల మంది ఉద్యోగులతో రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. గతేడాది మార్చిలో ఆ కంపెనీకి భారీ లాభాలు వచ్చాయి. రోజుకు 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకూ లభాలు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. వాటికి నమ్మకమైన పేమెంట్ గేట్‌వే కోసం కీర్తీని ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు.