07వ తేదీ నుంచి మెట్రో..ఒక్కో రైలులో ఎంత మంది

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 05:53 AM IST
07వ తేదీ నుంచి మెట్రో..ఒక్కో రైలులో ఎంత మంది

Hyderabad Metro Rail Limited (HMRL) : కరోనా కారణంగా హైదరాబాద్ లో షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 2020, సెప్టెంబర్ 07వ తేదీ దశల వారీగా మెట్రో రైళ్లు నడపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ – 04 నిబంధనల ప్రకారం సర్వీసులు నడుపుతామని, కోవిడ్ – 19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.




గతంలో ఒక్కో రైలులో 1,000 మంది ప్రయాణించే వారని, కరోనా కారణంగా..ప్రస్తుతం 300 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముందని తెలిపారు. మెట్రోరైళ్లతో పాటు స్టేషన్‌ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు.

రైలులో క్రాస్‌ మార్కు పెట్టిన చోట కూర్చోకూడదని, మార్కు చేసిన ప్రాంతంలోనే నిలబడాల్సి ఉంటుందన్నారు. మెట్రో స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరిగా చెకింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్క్ లు ప్రతి స్టేషన్ వద్ద పెట్టడం జరుగుతోందని, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మాత్రం వారిని వెనక్కి పంపించి వేస్తామన్నారు.



ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తామన్నారు. స్మార్ట్‌ కార్డు ద్వారా క్యూఆర్‌కోడ్‌ టికెటింగ్‌తో ప్రయాణాలు చేయవచ్చన్న ఆయన..ప్రయాణం ముగిసిన ప్రతిసారి..క్యూఆర్ కోడ్ ను స్కానింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఇక లిఫ్ట్ లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని, కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించిన భరత్‌నగర్, మూసాపేట, యూసుఫ్‌గూడ, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌ స్టేషన్లలో రైలు ఆగదు.




సెప్టెంబర్ 07వ తేదీ నుంచి మొదటి దశలో కారిడార్‌ 1 మియాపూర్, ఎల్‌బీనగర్‌
సెప్టెంబర్ 08వ తేదీ నుంచి రెండో దశలో కారిడార్‌ 3 నాగోల్, రాయదుర్గ్‌.
సెప్టెంబర్ 09 వ తేదీ నుంచి కారిడార్‌ 2తో పాటు అన్ని ఇతర మార్గాల్లో సర్వీసులు.