బల్దియా సమరం : దుమారం రేపుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఖండిస్తున్న విపక్షాలు

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 06:26 AM IST
బల్దియా సమరం : దుమారం రేపుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఖండిస్తున్న విపక్షాలు

Telangana BJP Chief Bandi Sanjay Comments : బల్దియా ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు వింటర్‌లో హీట్‌ పుట్టిస్తున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహిస్తామన్న బండిసంజయ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడిపై టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగాయి.



సర్జికల్ స్ట్రైక్స్ :-
గ్రేటర్‌ హైదరాబాద్‌లో హై ఓల్టేజ్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. బల్దియా ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునే ట్రిక్స్‌ ప్లే చేస్తున్నాయి. ఓట్ల కోసం ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. మత కల్లోల పార్టీ అంటూ బీజేపీని టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసింది. దీని నుంచి బయటపడేందుకు ఎంఐఎంను మత పార్టీగా చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎంఐఎంతో జతకడుతున్న టీఆర్‌ఎస్‌ కూడా మత కల్లోలాలకు ఆజ్యం పోస్తుందంటూ బీజేపీ కౌంటర్‌ ఇస్తోంది. ఇలా నేతలంతా ఒకరు మీద ఒకరు కొత్తకొత్త ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బల్దియా పొలిటికల్‌ చౌరస్తాలోకి మరో వివాదం వచ్చి చేరింది. అదే సర్టికల్‌ స్ట్రైక్‌.



https://10tv.in/mamata-banerjee-calls-amit-shahs-lunch-at-tribal-family-a-show-off-says-food-was-cooked-at-five-star-hotels/
పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ :-
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…ఎంఐఎంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… మేయర్‌ పీఠం దక్కించుకుంటే .. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్నారు. రోహింగ్యాలను, పాకిస్తాన్‌ వారిని తరిమికొడతామని హెచ్చరించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. బల్దియా మేయర్‌ పీఠం దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఖాయమన్నారు.



ఖండించిన ఓవైసీ:-
బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాతబస్తీలో ఉన్న ముస్లింలంతా ఈ దేశ పౌరులేనని.. భారతీయులపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా అని ప్రశ్నించారు. పాతబస్తీలో ఎంతమంది పాకిస్తానీయులు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలంటే లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనాపై మెరుపుదాడి చేయాలని సవాల్‌ విసిరారు. చైనా 970 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మోదీ సర్కార్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు.



కేటీఆర్ ఫైర్ :-
బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కూడా ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలతో పోలుస్తారా…. హైదరాబాద్‌ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా అని ప్రశ్నించారు. ఎందుకు సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారని దుయ్యబట్టారు. పేదరికం, నిరుద్యోగంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని హితవు పలికారు. అంతేకానీ… నాలుగు ఓట్ల కోసం ఇంతలా బీజేపీ నేతలు దిగజారుతారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలి తీసుకుంటారా అని ధ్వజమెత్తారు. ప్రజలంతా ఆలోచించి గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటేయాలని కోరారు.



రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న షబ్బీర్:-
బండిసంజయ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ కూడా ఖండించారు. శత్రుస్థావరాలపై నిర్వహించాల్సిన సర్జికల్‌ స్ట్రైక్‌…. హైదరాబాద్‌లో నిర్వహిస్తామనడం సరికాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కానీ.. పోలీసులు కానీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.