బీ కేర్ ఫుల్.. హైదరాబాద్‌‌కు ఆరెంజ్ అలర్ట్, రెండు రోజులు భారీ వర్షాలు

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 01:48 PM IST
బీ కేర్ ఫుల్.. హైదరాబాద్‌‌కు ఆరెంజ్ అలర్ట్, రెండు రోజులు భారీ వర్షాలు

hyderabad rains: హైదరాబాద్‌ను వరుణుడు వదలనంటున్నాడు. సెకండ్‌ ఇన్సింగ్‌ మొదలుపెట్టేశాడు. గతవారం వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోకముందే.. మళ్లీ వానలతో విరుచుకుపడుతున్నాడు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. భాగ్యనగరంలో కురిసిన వర్షం దెబ్బకు నగరమంతా ఇంకా నీటి నుంచి బయటపడలేదు. ఇటీవలి బీభత్సం నుంచి తేరుకునేలోపే.. వరుణుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు. దీంతో.. అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లన్నీ అలర్టయ్యాయి. ఇప్పటికే వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.

వచ్చే రెండ్రోజుల పాటు వర్షాలు:
మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో ఇదే వాతావరణం కొనసాగనుంది. ఇప్పటికే.. వెదర్ డిపార్ట్‌మెంట్ నుంచి దీనికి సంబంధించిన వార్నింగ్ కూడా వచ్చేసింది. వచ్చే రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణశాఖ అధికారులు.

వాయుగుండంగా మారిన అల్పపీడనం:
తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. అది పశ్చిమదిశగా ప్రయాణించి.. బలహీన పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్షాలు కురుస్తాయని… ఇవాళ(అక్టోబర్ 19,2020), రేపు(అక్టోబర్ 20,2020) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది.

ఇవాళ, రేపు జాగ్రత్త:
ఇటీవలే.. హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు అలాగే నిలిచిపోయింది. వర్ష బీభత్సం నుంచి హైదరాబాద్ కోలుకుంటోందన్న టైంలో.. వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ దంచుతోంది వర్షం. ఇవాళ రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో.. ఇవాళ, రేపు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ చెబుతోంది.

భయాందోళనలో నగరవాసులు:
మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందనడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షం ఇప్పటికే నగరాన్ని దాదాపుగా ముంచేయడంతో… మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తమను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం:
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. చార్మినార్‌, ఖైరతాబాద్, లక్డీకపూల్‌ భారీగా వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, హిమాయత్‌నగర్‌, జూబ్లిహిల్స్‌, పంజాగుట్ట పరిసరాల్లో జోరు వాన కురుస్తోంది. ఇప్పటికే ముంపు ముప్పులో వందలాది కాలనీలు ఉన్నాయి. మళ్లీ వర్షం మొదలుకావడంతో హైదరాబాదీలకు భయం పట్టుకుంది. హైదరాబాద్‌లో వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.