Minister KTR : మంత్రి కేటీఆర్ సాయంతో చదువుకుని.. 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాబ్ సాధించిన అనాథ యువతి

కేటీఆర్ సాయంతో చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను దాచుకున్న డబ్బుతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్చింది.

Minister KTR : మంత్రి కేటీఆర్ సాయంతో చదువుకుని.. 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాబ్ సాధించిన అనాథ యువతి

Minister KTR : ఎవరికైనా ఆపద వస్తే నేనున్నా అని ముందుకొచ్చే వ్యక్తి మంత్రి కేటీఆర్. నేరుగా కానీ, ట్విట్టర్ లో కానీ ఇతరుల ద్వారా కానీ ఎవరికైనా సాయం కావాలని తెలిస్తే కేటీఆర్ స్పందించి ఆదుకుంటారు. అలా ఇప్పటివరకు ఆయన చాలామందికి సాయం చేశారు. అలా సాయం పొందిన వారిలో చాలామంది ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు.

అలా కేటీఆర్ సాయం పొంది చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. జగిత్యాల జిల్లాకు చెందిన అనాథ యువతి రుద్ర రచన చుదువుకు కేటీఆర్ సహకరించారు. ఆయన ప్రోత్సాహంతో రుద్ర ఇంజినీరింగ్ పూర్తి చేయడమే కాదు క్యాంపస్ సెలక్షన్ లో 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో కొలువు సంపాదించింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మంత్రి కేటీఆర్ తో పంచుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్ ను కలిసింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తన సాయంతో బాగా చదువుకుని కొలువు సాధించిన రుద్రను చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ రుద్రను ఆశీర్వదించారు.

తన జీవితానికి ఓ గమ్యాన్ని చూపించిన మంత్రి కేటీఆర్‌ చేసిన సాయాన్ని మర్చిపోని రచన.. ప్రగతిభవన్ కు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. రుద్ర సాధించిన ఉద్యోగాల వివరాలను తెలుసుకుని కేటీఆర్ ఆమెను అభినందించారు. తల్లిదండ్రులు లేని తనకు ఓ అన్నగా అండగా నిలిచారంటూ రచన భావోద్వేగానికి లోనైంది. మంత్రి కేటీఆర్‌కి రాఖీ కట్టాలనుకున్న విషయాన్ని చెప్పింది. తాను దాచుకున్న డబ్బుతో తయారు చేయించిన వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్చింది రచన.

జీవితంలో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఎదిగిన రచనను చూసి కేటీఆర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జీవితంలో మరింత స్థిరపడే వరకూ తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. నాలుగు కంపెనీల్లో కొలువులు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్ ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది.

అయితే ఇంజనీరింగ్ ఫీజు చెల్లించే విషయంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. 2019లో రచనను ప్రగతిభవన్‌కి పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్ధిక సాయంతో చదువుకున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాబ్ సాధించడం విశేషం.