ORR Toll Charges : ఓఆర్ఆర్ టోల్ చార్జీలు పెరిగాయి

10TV Telugu News

ORR Toll Charges increased by HGCL : హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్‌ చార్జీలు పెరిగాయి. ప్రస్తుతం, చెల్లించే ధరపై 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్‌జీసీఎల్‌ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రకరకాల వాహనాలపై ప్రతి కి.మీ.కు కనీసం ఆరు పైసల నుంచి 39 పైసల మేర టోల్‌ చార్జీ పెరిగింది.

ఔటర్‌ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) సంస్థ ప్రతి యేటా కొంత మేర వాహనాలకు వసూలు చేసే టోల్‌ చార్జీలను పెంచేందుకు అవకాశం ఉంది. జీవో నం. 365 క్లాజ్‌ 5 ప్రకారం నెహ్రూ ఔటర్‌ రింగు రోడ్డు టోల్‌ రూల్స్‌-2012ను అనుసరించి ప్రతియేటా యూజర్‌ చార్జీలను పెంచేందుకు అవకాశం ఉంది. పెరిగిన చార్జీలు నేటినుంచి అమలులోకి వచ్చాయి.

నగరం చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఓఆర్‌ఆర్‌పై ప్రతి రోజు 1.20 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు మినహాయిస్తే.., అన్ని రకాల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు సాగించవచ్చు. గత యేడాది ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఏప్రిల్‌ నెలలో వాహనదారుల రాకపోకలు బాగా తగ్గాయి. ఆ తర్వాత లాక్‌డౌన్‌ సడలింపులో ట్రాఫిక్‌ పెరుగుతూ వచ్చింది.

ప్రస్తుతం, ఓఆర్‌ఆర్‌ పై వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. నగరం మీదుగా దేశంలోని మెట్రో నగరాలకు వెళ్లేందుకు ఉన్న జాతీయ రహదారులను, ఇతర రాష్ర్టాలు, పట్టణాలను కలిపేందుకు ఉన్న పలు రోడ్ల మీద వచ్చే వాహనాలతో పాటు కోర్‌ సిటీ నుంచి ఔటర్‌ వరకు నిర్మించిన 33 రేడియల్‌ రోడ్ల మీదుగా వచ్చే ట్రాఫిక్‌తో రద్దీ ప్రతియేటా గణనీయంగా పెరుగుతోంది.

ప్రధానంగా ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, నానక్‌రాంగూడ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వెళ్లేందుకు 24 కి.మీ ఓఆర్‌ఆర్‌ అత్యంత అనుకూలంగా ఉంది. దీంతో ఈ మార్గంలో 60-70 వేల వాహనాల వరకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి.

వాహనాల రద్దీకి అనుగుణంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ అధికారులు రకరకాల అభివృద్ధి పనులను చేపడుతూ వాహనదారులు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలను హెచ్‌ఎండీఏ వెచ్చిస్తోంది.