అవార్డుల బాలు..

అవార్డుల బాలు..

Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్‌ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను బాలుకు ప్రకటించింది. అయితే బాలుకు రివార్డులు, అవార్డులు కొత్తేమీ కాదు. మరి సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బాలు అందుకున్న అవార్డులు ఏంటి.. సొంతం చేసుకున్న రికార్డులు ఏంటి..?

దేశం గర్వించదగ్గ గాన గంధర్వుడు ఎస్పీ బాలు. దాదాపు 50 ఏళ్ల పాటు సినిమా రంగంలో 40 వేలకు పైగా పాటలు పాడారాయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకున్న బాలును.. మరణానంతరం పద్మ విభూషణ్‌ పురస్కారం వరించింది. ఈ మూడు పద్మ అవార్డులకు ఎస్పీ బాలు పేరును తమిళనాడు ప్రభుత్వం నామినేట్ చేసింది. బాలుకు అవార్డులు, రికార్డ్‌లు ఏమీ కొత్తకాదు. 50 ఏళ్ల సంగీత సామ్రాజ్యంలో.. ఎన్నో రికార్డులు బాలు సొంతం చేసుకున్నారు. బాలు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

బాల సుబ్రమణ్యం జీవితంలో పాటలకే పరిమితం కాలేదు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలకు, టీవీ షోలకు పనిచేశారంటే ఎస్పీ బాల సుబ్రమణ్యంలో ఎంతటి కళాత్రుష్ణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాలు అంటే అందరికీ తెలిసింది సింగర్ మాత్రమే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. బాలు సకల కళా వల్లభుడు. గాయకుడే కాదు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, మిమిక్రీ కళాకారుడు, టీవీ వ్యాఖ్యాతతో పాటు బహు భాషా కోవిదుడు. 25 నంది అవార్డులు, 6 జాతీయ పురస్కారాలు, లెక్కలేనని ఇతరత్రా అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తులు, ఒరియా, అస్సామీ, బడగా, సంస్కృతం, కొంకిని, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా 14 భాషల్లో పాటలు పడి ఎవరికీ సాధ్యం కాని రీతిలో రికార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే ఒకేరోజు ఏకధాటిగా 17 పాటలను రికార్డ్ చేసి అరుదైన రికార్డును కూడా బాలు సాధించారు.

పాడటం, కంపోజింగ్ చేయడమే కాకుండా ఏకంగా పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన వ్యక్తి బాల సుబ్రమణ్యం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో 45 చిత్రాలకు సంగీతం సమకూర్చి సంగీత ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేశారు.