తల్లిదండ్రులను వదిలేసే పిల్లలకు హెచ్చరిక, ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు

10TV Telugu News

parents can take back their assets from children: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు హెచ్చరిక. అలా చేస్తే తల్లిదండ్రుల ఆస్తి మీకు రాదు. ఒకవేళ ఆస్తి రాసిచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే.. దాన్ని తల్లిదండ్రులు మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు చట్టంలో ఉంది. ఈ విషయాన్ని సీనియర్‌ సివిల్‌ జడ్జి, సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్‌ తెలిపారు.

”తల్లిదండ్రులను వదిలేసి నిరాశ్రయులను చేయడం తీవ్రమైన నేరం. అందుకు మూడునెలల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. మాయమాటలతో మోసాలకు పాల్పడి… తల్లిదండ్రుల ఆస్తిని కాజేసి… వారిని చూసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే తల్లిదండ్రులు తమ ఆస్తిని తిరిగి వెనక్కి పొందే అవకాశాన్ని చట్టం కల్పిస్తుంది” అని మురళీమోహన్‌ చెప్పారు.

హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో వాకర్స్‌ క్లబ్‌ సహకారంతో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్‌ సిటిజన్స్‌ కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కె. మురళీమోహన్‌.. పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ పోషణ, సంక్షేమ చట్టం గురించి వివరించారు. నిరాదరణకు గురవుతున్న పెద్దలు, తమ పోషణ నిమిత్తం ఆర్‌డీఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్‌ను సంప్రదించవచ్చని వివరించారు.

×