telangana corona : బ్రేకింగ్ న్యూస్, త్వరలో తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, బార్లు, పబ్బులపై ఆంక్షలు

కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.

telangana corona : బ్రేకింగ్ న్యూస్, త్వరలో తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, బార్లు, పబ్బులపై ఆంక్షలు

Partial Lockdown In Telangana

lockdown : తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా.. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. పది రోజులుగా చూస్తే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో.. కేసుల కట్టడి.. బాధితుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా… పాక్షిక లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అలాగే.. నైట్ కర్ఫ్యూ, రాత్రి పూట లాక్‌డౌన్ విధించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది కరోనా కేసులు వెలుగు చూడటంతో.. సరిగ్గా ఇదే రోజున కఠిన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కేంద్రం జనతా కర్ఫ్యూ ప్రకటనకు ముందే… సినిమా హాళ్లు, స్కూళ్లు, మార్కెట్లతో సహా.. రద్దీ ప్రదేశాలను మార్చ్ 31 వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏడాది తర్వాత మళ్లీ అలాంటి నిర్ణయాలనే సీఎం కేసీఆర్ తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఎందుకంటే… తెలంగాణలో మళ్లీ క‌రోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. ఇప్పుడు వందల్లోకి చేరాయి. ఇవి కేవ‌లం ప్రభుత్వ లెక్కలు మాత్రమే.. క్షేత్ర స్థాయిలో వీటికి మూడింత‌లు ఉంటాయ‌ని అంచ‌నా. ఇప్పటికే విద్యాసంస్థల్లో కోవిడ్ దూసుకుపోతుంది. ప‌క్క రాష్ట్రాల నుంచి వ్యాపిస్తున్న వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అలెర్ట్ అయిన‌ప్పటికీ కేసులు మాత్రం ఆగ‌టం లేదు.

గత 24గంటల్లో వ్యవధిలో.. తెలంగాణవ్యాప్తంగా 64 వేల 898మందికి కరోనా టెస్టులు చేయగా 394మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కొన్ని రోజులుగా ఇదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం రోజు 364 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రోజున 313మందికి వైరస్ సోకింది. ఇలా… కొన్ని రోజుల నుంచి పరిశీలిస్తే… కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా నివారణకు చర్యలు తీసుకుంటోంది. ప్రజలను సైతం అలర్ట్ చేస్తోంది. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. ప్రజలు భౌతిక దూరం పాటించడమే కాకుండా.. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అధికారులకు ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా నివారణకు అందరూ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా… ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి. కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తెలంగాణలో ఇప్పటివరకు అన్ని స్కూల్స్‌లో దాదాపు 500 నుంచి 600 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్, కరీంనగర్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు స్కూళ్లల్లో విద్యార్థులు, టీచర్లు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. పాఠశాలల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో… తరగతులు కొనసాగించాలా వద్దా అనే దానిపై పునరాలోచనలో పడింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్‌ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుంటే.. కేవలం 9, 10 విద్యార్థులకు క్లాసులు నిర్వహించి.. మిగతా తరగతులకు సెలవులు ప్రకటించే విషయంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

మరోవైపు… మహారాష్ట్రలో కేసుల సంఖ్య దారుణంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్రకు సంబంధించినవే ఉంటున్నాయి. ఆ ప్రభావం సరిహద్దు జిల్లాలపై పడుతోంది. పక్క రాష్ట్రాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇది కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో.. గండం తప్పించుకోవాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే పాక్షికంగా లాక్‌డౌన్ విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అటు బార్లు, పబ్బులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.