Nizamabad Politics : నిజామాబాద్‌లో మళ్లీ ‘పసుపు’ రాజకీయాలు

తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ.. కవిత పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్‌గా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Nizamabad Politics : నిజామాబాద్‌లో మళ్లీ ‘పసుపు’ రాజకీయాలు

Nizamabad

pasupu board politics : 2018లో నిజామాబాద్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన పసుపు రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. పసుపు బోర్డు ఏర్పాటు హామీపై నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేశానన్న అరవింద్‌ మూడేళ్లగా ఏం చేశారో చెప్పాలని కవిత నిలదీశారు. తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ.. కవిత పసుపు బోర్డు అంశాన్ని మళ్లీ లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్‌గా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. కేసీఆర్ కుమార్తె కావడం, పార్టీలో కీలకపాత్ర పోషిస్తుండడం, నిజామాబాద్ రాజకీయాలపైనా పట్టు సాధించడంతో కవిత రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదని అంతా భావించారు. కానీ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత… రైతులు పెద్ద ఎత్తున కవితకు పోటీగా నామినేషన్లు వేయడంతో పరిస్థితి తారుమారైంది. టీడీపీలో రైతు నేతగా పేరొందిన మండవ వెంకటేశ్వరరావును పార్టీలోకి చేర్చుకుని.. రైతులను ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Rajya Sabha By-Election : తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

పసుపుకు మద్దతు ధర లేకపోవడం, పసుపు బోర్డు కావాలన్న తమ చిరకాల డిమాండ్ తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు నామినేషన్లు ఉపసంహరించేందుకు అంగీకరించలేదు. దీంతో ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించే వీలులేక బ్యాలెట్ పత్రం ఉపయోగించాల్సి వచ్చింది. పసుపు బోర్డు తెస్తానని హామీతో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన బీజేపీ నేత, డీఎస్ కొడుకు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో గెలుపొందారు.

ఎంపీగా ఓడిపోవడంతో కవితకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది టీఆర్‌ఎస్. ఇప్పుడామె శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. ప్రత్యేక సందర్భాల్లో మినహా కవిత మీడియా ముందుకు రారు. అలాంటిది ఆమె ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇప్పుడు పసుపుబోర్డు హామీ అమలు చేయకపోవడంపై అరవింద్‌ను దుయ్యబడుతున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు పసుపు బోర్డ్ వేదికగా ఇందూరు రాజకీయ వేదికపై మళ్లీ మెరిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇన్నాళ్లూ పసుపు బోర్డు గురించి మాట్లాడకపోవడానికి కారణం… ఇచ్చిన హామీ నెరవేరుస్తారని అరవింద్‌ ఎదురుచూడడమేనని అంటున్నారు కవిత.

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి : రేవంత్ రెడ్డి

మూడేళ్ల పాటు బోర్డు కోసం ఎదురు చూసీ చూసీ విసుగు చెందే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోందన్నారు. అరవింద్‌ తప్పుడు ప్రమాణాలు చేసి నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందారని ఆరోపించారు. 2014లో తాను ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల మద్దతు లేఖలు తీసుకొచ్చానని, నిజామాబాద్ ప్రతినిధులంతా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. 2019కి ముందే ఫిల్డీ ఆఫీస్, డివిజనల్ ఆఫీస్, స్పైస్‌ బోర్డ్ కూడా టీఆర్‌ఎస్ తీసుకొస్తే.. ఎంపీ అర్వింద్ తానే తీసుకొచ్చినట్టు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పసుపు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అర్వింద్ నెరవేర్చలేదని విమర్శించారు.