Jana sena Glass symbol: జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ.. సింబల్ పోయింది

Jana sena Glass symbol: జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ.. సింబల్ పోయింది

Janasena

Janasena: పవన్ కళ్యాణ్‌ సారధ్యంలోని జనసేన పార్టీకి ఊహించని ఎదరుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలో జరగబోయే ఎన్నికల పోటీలో జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్‌ గుర్తులను కోల్పోయాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని కారణంగా పార్టీలు కామన్‌ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా పోటీ నుంచి జనసేన తప్పుకోగా.. ఇదే విషయాన్ని ఎస్ఈసీకి లేఖ రాశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలో.. త్వరలో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన భావిస్తూ ఉండగా.. తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్‌ సింబల్‌ను కొనసాగించాలని ఎస్‌ఈసీని కోరింది జనసేన.

అయితే జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. జనసేనతో సహా ఇతరపార్టీలు 2025 నవంబర్‌ 18 వరకు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.