Munugodu BY-Election : మునుగోడు ముఖచిత్రం ఏంటీ?కంచుకోటను కాంగ్రెస్‌ కాపాడుకుంటుందా? టీఆర్ఎస్,బీజేపీ ఎత్తులు పై ఎత్తులు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్‌ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎంత కీలకం.. మునుగోడు సామాజిక చిత్రమ్‌ చెప్తోంది ఏంటి.. ఈ ఎన్నికల్లో విక్టరీని డిసైడ్‌ చేయబోయే వర్గాలు ఏంటి ?

Munugodu BY-Election : మునుగోడు ముఖచిత్రం ఏంటీ?కంచుకోటను కాంగ్రెస్‌ కాపాడుకుంటుందా? టీఆర్ఎస్,బీజేపీ ఎత్తులు పై ఎత్తులు

 Munugodu BY-Election heat: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో ఉపఎన్నిక రాబోతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్‌ అనివార్యం అయింది. దీంతో మునుగోడు ఎపిసోడ్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఎలక్షన్‌గా భావిస్తుండడంతో.. మూడు పార్టీలు ఈ బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎంత కీలకం.. మునుగోడు సామాజిక చిత్రమ్‌ చెప్తోంది ఏంటి.. ఈ ఎన్నికల్లో విక్టరీని డిసైడ్‌ చేయబోయే వర్గాలు ఏంటి ?

తెలంగాణలో మునుగోడు ఎపిసోడ్‌ కాక రేపుతోంది. రాజకీయం అంతా మునుగోడు విధుల్లోనే తిరుగుతోంది.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. ఎత్తులు పైఎత్తులు.. సన్నాహాలు, సమాలోచనలు.. అన్ని పార్టీల టార్గెట్ ఒక్కటే.. అదే మునుగోడు ! కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇది అలాంటిలాంటి ఎన్నిక కాదు. నమ్మకానికి, నమ్మినవారికి జరుగుతున్న పోరాటం.. ఓ పార్టీలో అంతర్యుద్ధానికి, ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి జరుగుతున్న పోరాటం. అందుకే ఇప్పుడు తెలంగాణ మొత్తం మునుగోడు వైపే చూస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రతీ పరిణామాన్ని.. అటు పడుతున్న పడుతున్న ప్రతీ అడుగును పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి బైపోల్‌లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయ్.

హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజురాబాద్‌ ఉప ఎన్నికలు.. నువ్వానేనా అన్నట్లు జరిగినా.. సాధారణ ఎన్నికలకు కొద్దిరోజులకు ముందు జరగబోతున్న మునుగోడు ఉపఎన్నిక.. మరింత కీలకంగా మారింది. పోటీలో నిలిచే అభ్యర్థుల కంటే.. వారిని బరిలోకి దించే పార్టీలకు, అధిష్ఠానాలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయ్. మునుగోడు బైపోల్‌ ఫలితం.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి.. ఈ సీటు గెలుచుకోవడం అత్యంత అవసరమైనా.. ఆయన కంటే కూడా బీజేపీకి మరింత ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న బీజేపీ… మునుగోడులో గెలిచి, ఇక రాబోయేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే అని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. టీఆర్ఎస్‌కు కూడా ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం. అధికారంలో ఉండి.. ఉప ఎన్నికల్లో రెండుసార్లు ఎదురుదెబ్బ తిన్న కారు పార్టీకి.. ఈ ఎన్నిక సవాల్‌ కానుంది.

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది.. పైగా సిట్టింగ్ సీట్‌ ! అంతర్గత కుమ్ములాటలతో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ.. అధికారం రేసులో తాము ఉన్నామని సంకేతాలు పంపాలంటే.. కోమటిరెడ్డి కుటుంబాన్ని ఓడించి.. విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈ నవంబర్‌లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయ్. ఆ రాష్ట్రాలతో పాటే మునుగోడు ఉపఎన్నికను నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే దేశంలోని మిగతా స్థానాలతో కలిపి ఉపఎన్నిక నిర్వహిస్తే.. అంతకుముందు కూడూ రావొచ్చు. ఇదంతా ఎలా ఉన్నా.. ఉపఎన్నిక వస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని.. నిధుల వరద పారుతుందని పార్టీలకు అతీతంగా స్థానికులు అనుకుంటున్నారు.

మునుగోడు నుంచి 2018ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టమైన అధిపత్యం ప్రదర్శించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై 22వేల 272 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజగోపాల్‌రెడ్డికి 97వేల 239 ఓట్లు రాగా, ప్రభాకర్‌రెడ్డికి 74వేల 687 ఓట్లు వచ్చాయ్. ఆ ఎన్నికల్లో మొత్తం 15మంది అభ్యర్థులు పోటీ చేయగా.. కోమటిరెడ్డికి 48.90 శాతం.. ప్రభాకర్‌రెడ్డికి 37.56 శాతం ఓట్లు వచ్చాయ్‌. 12వేల 725 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్ధతిస్తారన్న దానిపై స్థానికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు రాజగోపాల్ రెడ్డికి మద్ధతు తెలుపుతుండగా.. మరికొందరు ఆయన కాంగ్రెస్ వీడడం కరెక్ట్ కాదంటున్నారు.

1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పాటుకాగా.. ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఆరుసార్లు, సీపీఐ ఐదుసార్లు.. టీఆర్ఎస్‌ ఒక్కసారిగా విజయం సాధించాయ్. ఈ నియోజకవర్గంలో 159 గ్రామ పంచాయతీలు, 18 తండా పంచాయితీలు ఉన్నాయ్. మొత్తం 2లక్షల 20వేల మందికి పైగా ఓటర్లు ఉండగా.. ఎస్సీ ఓటర్లు 17.7శాతం, ఎస్టీ ఓటర్లు 6.74శాతం ఓటర్లు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే.. నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ.. 35వేల 150 మంది ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజ్ ఓటర్లు 33వేల 9వందలు.. ఎస్సీ మాదిగ 25వేల 650, ఎస్సీ మాల 10వేల 350… యాదవ 21వేల 360, పద్మశాలి 11వేల 680.. ఎస్టీ 10వేల 520, వడ్డెర 8వేల 350, కుమ్మరి 7వేల 850, విశ్వ బ్రాహ్మణ 7వేల 820, రెడ్డి 7వేల 690, ముస్లిం మైనార్టీ 7వేల 650, కమ్మ 5వేల 680, ఆర్య వైశ్య 3వేల 760, వెలమ 2వేల 360, మున్నూరు కాపు 2వేల 350, ఇతర కులాల నుంచి 18వేల 4వందల మంది ఓటర్లు ఉన్నారు.

గౌడ సామాజికవర్గంతో పాటు.. ఎస్సీ, ఎస్టీలు మునుగోడులో ఎవరు విజయం ఎవరిది అని డిసైడ్‌ చేసే గేమ్‌ ఛేంజర్లు కాబోతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక సమీకరణాలను ముందు పెట్టుకొని వ్యూహాలు రచిస్తున్నాయ్. పార్టీల చేరికల నుంచి.. హామీల వరకు.. అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయ్. బీజేపీ నుంచి అభ్యర్థి దాదాపు ఫైనల్‌ అవగా.. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లో చర్చల మీద చర్చలు నడుస్తున్నాయ్. ఉపఎన్నిక పోరులో.. కాంగ్రెస్‌ ముందుగానే ఓ అడుగు వేసింది. బైపోల్‌పై కమిటీ ఏర్పాటు చేసింది.