Podu Land in Telangana : భారీ స్థాయిలో ఆక్రమణకు గురవుతున్న అటవీ భూములు .. పర్యావరణవేత్తల ఆందోళన

పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్యే.. అడవుల్లో ఘర్షణలు పెరిగిపోయాయి. 2005 తర్వాత ఊహించని స్థాయిలో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై.. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Podu Land in Telangana : భారీ స్థాయిలో ఆక్రమణకు గురవుతున్న అటవీ భూములు .. పర్యావరణవేత్తల ఆందోళన

Podu Land in Telangana : పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్యే.. అడవుల్లో ఘర్షణలు పెరిగిపోయాయి. 2005 తర్వాత ఊహించని స్థాయిలో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై.. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ భూములను క్లెయిమ్ చేస్తూ వచ్చిన దరఖాస్తుల్లో.. 2005కి ముందు లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత కలిగి ఉన్నాయి. అయితే.. 2005 తర్వాత 5 లక్షల 60 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కానీ.. 2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం ప్రకారం.. ఆ భూములకు హక్కులు కల్పించేందుకు అవకాశం లేదు. అందువల్ల.. ఆక్రమణకు గురైన అటవీ భూముల్లో ఫారెస్ట్ అధికారులు దాదాపు 62 వేల ఎకరాల్లో మళ్లీ మొక్కలు పెంచారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కూడా అలాంటి ప్లాంటేషన్‌ను కాపాడేందుకు ప్రయత్నించే.. గుత్తికోయల చేతిలో దారుణంగా హతమయ్యారు.

Podu Land Dispute in Telangana : భూముల సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోతోంది? అటవీ చట్టాలు ఏం చెబుతున్నాయ్?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో.. 96 వేల 676 గిరిజన కుటుంబాలకు.. ఆర్వోఎఫ్ఆర్-2006 చట్టం కింద.. 3 లక్షల 33 వేల ఎకరాల పోడు భూములపై హక్కులను కల్పించారు. ఇదిలా ఉంటే.. పేద గిరిజనుల ప్రయోజనం కోసం 2005 డిసెంబర్ 13 కటాఫ్ తేదీని పొడిగించాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ లోనే.. కేంద్రానికి లేఖ రాసింది. సీఎం కేసీఆర్ కూడా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అటవీ భూములకు సంబంధించి.. కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని.. దాని వల్ల అక్కడున్న ప్రజలు వామపక్ష తీవ్రవాదానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షా 20 వేల ఎకరాలకు అటవీ భూములకు సంబంధించి 30 వేల 601 మంది క్లెయిమ్‌లను.. 2005 కటాఫ్ తేదీ దాటిన కారణంగా తిరస్కరించారు. గిరిజనేతర పేద ప్రజల క్లెయిమ్‌లను.. చట్టం కింద పరిగణించలేమని సీఎం.. తన లేఖలో తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం చట్టాన్ని సవరించాలని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అప్పుడే కోరారు. తర్వాత.. జిల్లా సమన్వయ కమిటీల ఏర్పాటు కూడా చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు 33 జిల్లాల్లోని 3911 గ్రామపంచాయతీల్లో.. 5750 హ్యాబిటేషన్లలో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు.. వచ్చిన క్లెయిమ్‌లను పరిశీలించడంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలను, విస్తీర్ణాన్ని, జీపీఎస్ కోఆర్డినేట్స్‌ను నిర్ధారిస్తాయి. తర్వాత.. వెరిఫికేషన్‌కు హాజరుకావాలని గ్రామ రెవెన్యూ అసిస్టెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌తో పాటు పోడు భూమిని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తికి.. అటవీ హక్కుల కమిటీ తెలియజేస్తుంది. గ్రామసభల్లో ఈ క్లెయిమ్‌లను అంగీకరించడం గానీ, తిరస్కరించడం గానీ జరుగుతుంది. గ్రామసభల తీర్మానం మేరకే.. డివిజినల్, జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయాలు తీసుకుంటాయి. జిల్లా స్థాయి కమిటీ మాత్రమే.. పోడు భూముల క్లెయిమ్‌లకు సంబంధించిన హక్కు పత్రాలను తయారు చేసి, పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను పరిశీలిస్తే సగటున .. ఒక్కో గిరిజనుడు 3 ఎకరాల 2 గుంటలు, ఒక్కో గిరిజనేతరుడు రెండున్నర ఎకరాల చొప్పున క్లెయిమ్ చేశారు.

Telangana : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉందా?

అయితే.. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యతో.. అటవీ సిబ్బందిలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు ఆయుధాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి.. అటవీ భూముల రక్షణ విషయంలో.. వాళ్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. గిరిజనులు, ఆదివాసీలు, గుత్తికోయలు భూములు ఆక్రమణలను అడ్డుకునేందుకు ఒకరిద్దరు వెళతారు. అక్కడికెళ్లాక.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భయపెట్టేందుకు కూడా వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండవు. మరోవైపు.. ప్రభుత్వమే.. పోడు భూములపై హక్కులు ఇస్తామనడంతో.. ఆక్రమణలు మరింత పెరిగిపోయాయ్. అదే సమయంలో.. గిరిజనులు భూములను ఆక్రమిస్తుంటే.. ఏం చేస్తున్నారని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుంటాయి. దీంతో.. వాళ్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా.. పోడు భూముల్లో జరుగుతున్న దాడుల్లో.. అప్పుడప్పుడు గాయాలపాలవుతున్నారు. తాజాగా.. శ్రీనివాసరావు హత్యతో.. వాళ్లలో ఉన్న భయాలు రెట్టింపయ్యాయి.

Forest Officer Killed : ఫారెస్ట్ రేంజర్ హత్య.. తుపాకులు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటున్న అటవీశాఖ సిబ్బంది

ఇక.. పోడు భూముల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యను ఆమె ఖండించారు. అసలు.. గుత్తికోయలు తెలంగాణ గిరిజనులే కాదని.. వాళ్లకు అటవీ భూములపై హక్కు లేదని తెలిపారు. గుత్తికోయలకు పోడు భూములు ఇవ్వడం కుదరదన్నారు. డిసెంబర్ 1 తర్వాత.. అర్హులైన వారికి సీఎం కేసీఆర్ పోడు పట్టాలను పంపిణీ చేస్తారని తెలిపారు.  దాదాపు 3 లక్షల 60 వేల ఎకరాలు.. ఇప్పటికీ అటవీశాఖ భూమిగానే ఉంది. ఇది ఆక్రమణకు గురికానప్పటికీ.. కొందరు క్లెయిమ్ చేశారు. ప్రస్తుతం.. అడవులను నరికివేసే ప్రయత్నాలు జరుగుతుండటంతో.. పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.