పోలీసుల అదుపులో చిరంజీవి, శ్రీనివాస్.. లాయర్ దంపతుల హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

పోలీసుల అదుపులో చిరంజీవి, శ్రీనివాస్.. లాయర్ దంపతుల హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

police arrest chiranjeevi, kunta srinivas: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసుని పోలీసులు 24గంట్లో చేధించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, వసంతరావు, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎ-1గా వెల్ది వసంతరావు, ఎ-2గా కుంట శ్రీనివాస్‌, ఎ-3గా అక్కపాక కుమార్‌ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

వామన్ రావుని నరికి చంపింది కుంట శ్రీనివాస్, చిరంజీవిగా పోలీసులు కనుగొన్నారు. చిరంజీవి కుంట శ్రీనివాస్ కి ప్రధాన అనుచరుడు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా కుంట శ్రీనివాస్, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంట శ్రీనివాస్ కోసం వామన్ రావుని చిరంజీవి నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

కుంట శ్రీనివాస్ ఏది చెబితే అది చిరంజీవి చేస్తాడు. తాను వామన్ రావు కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు కుంట శ్రీనివాస్..తన అనుచరుడు చిరంజీవితో చెప్పాడు. వామన్ రావుని చంపేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్, చిరంజీవి సహకారం కావాలని అడిగాడు. అందుకు చిరంజీవి సరే చెప్పాడు. కుంట శ్రీనివాస్ తో కలిసి వెళ్లిన చిరంజీవి.. వామన్ రావు, నాగమణిలపై కత్తులతో దాడి చేసి చంపారు.

సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మహారాష్ట్ర సరిహద్దులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాయర్ దంపతుల హత్యకు ప్రధాన కారణాలు ఏంటి? ఈ హత్యకు ఎవరెవరు సహకరించారు? ప్రతక్ష్యంగా, పరోక్షంగా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఎంత మంది రెక్కీ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

బుధవారం(ఫిబ్రవరి 17,2021) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర గట్టు వామన్‌రావు(49), నాగమణి(45) దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు. ఇదే వారి పాలిట మృత్యువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.