కోయిలమ్మ సీరియల్ నటుడు అరెస్ట్, చర్లపల్లి జైలుకి తరలింపు

కోయిలమ్మ సీరియల్ నటుడు అరెస్ట్, చర్లపల్లి జైలుకి తరలింపు

police arrest koilamma serial actor amar: బొటిక్ విషయంలో జరిగిన సెటిల్ మెంట్ వివాదంలో కేసు రిజిస్టర్ అయిన దాదాపు రెండు వారాల తర్వాత కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అమర్ ను అదుపులోకి తీసుకున్నారు. కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌రిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించ‌డంతో చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు పోలీసులు. జ‌న‌వ‌రి 27న శ్రీవిద్య‌, అప‌ర్ణ అనే యువ‌తులు తమపై దాడి చేశాడని అమర్ పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు అమర్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు

అస‌లేం జ‌రిగిందంటే..
శ్రీవిద్య‌, అప‌ర్ణ‌, స్వాతి అనే ముగ్గురు యువ‌తులు క‌లిసి మ‌ణికొండ‌లో బొటిక్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ్రీవిద్య‌, అప‌ర్ణ‌తో స్వాతికి వివాదం చోటు చేసుకుంది. దీంతో స్వాతికి మ‌ద్ద‌తుగా సమీర్ తో పాటు మ‌రో ముగ్గురు ఆక‌తాయిలు.. శ్రీవిద్య‌, అప‌ర్ణ ఉంటున్న ఇంటికి జ‌న‌వ‌రి 27న వెళ్లి వారిపై దాడి చేశారు. అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషించి, లైంగికంగా అమ‌ర్ వేధించాడంటూ.. శ్రీవిద్య‌, అప‌ర్ణ క‌లిసి రాయ‌దుర్గం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, సమీర్ ను ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదన్న అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. కేసును నీరుగారుస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు సమీర్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించడం గమనార్హం.

కాగా, అమర్ వెర్షన్ మరోలా ఉంది. అసలు ఈ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. మేమంతా స్నేహితులమే అని.. కుట్ర ప్రకారమే తనని ఇందులో ఇరికించారని వాపోయాడు. ఓ టీవీ జర్నలిస్ట్ కుట్ర పన్ని ఇలా చేసిందని ఆరోపించాడు. ఆమె తనను చెంపపై కొట్టడమే కాకుండా రౌడీ షీటర్లతో తమపై దాడి చేయించిందంటూ సంచలన విషయాలు చెప్పాడు అమర్.