Suryapeta Gallery accident : సూర్యాపేట గ్యాలరీ ప్రమాదంపై కేసు నమోదు

సూర్యాపేట గ్యాలరీ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు అంచానా వేసిన అధికారులు.. మూడు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

Suryapeta Gallery accident : సూర్యాపేట గ్యాలరీ ప్రమాదంపై కేసు నమోదు

Suryapeta Gallery Accident

Suryapeta Gallery accident : సూర్యాపేట గ్యాలరీ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు అంచానా వేసిన అధికారులు.. మూడు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులపై 366, 367, 368 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసుల అంచనా వేశారు. విచారణ కోసం డీఎస్పీ మోహన్‌ కుమార్‌ను పోలీసుశాఖ ప్రత్యేకంగా నియమించింది.

సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తమ పిల్లలను ఎవరు పట్టించుకోవడం లేదని సూర్యాపేట జిల్లా కబడ్డీ గ్యాలరీ ప్రమాద బాధితుల తల్లిదండ్రులు అన్నారు. ఎక్స్‌రే తీయలేదని.. టెస్టులు చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల పరిస్థితి ఏంటి అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ఆగ్రహం చేశారు.

సూర్యాపేట స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలే సమయంలో అక్కడ 15వేల మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు. గ్యాలరీ నిర్మించేందుకు పొడవాటి స్టీల్‌ రాడ్లు, కర్రలు ఉపయోగించారు. ప్రేక్షకులంతా ఆ భారీ, స్టీల్, సెంట్రింగ్ కర్రల కింద చిక్కుకుపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే… చాలామంది స్పృహ కోల్పోయారు. బరువైన ఇనుపరాడ్లు మీద పడడంతో చాలా మంది గాయపడ్డారు. స్టీల్ రాడ్ల బరువు మోయలేక, పైకి లేవలేక నరకయాతన అనుభవించారు.

అనేకమందికి బలమైన గాయాలయ్యాయి. ఓ ప్రేక్షకుని కాలు మొత్తం విరిగిపోయి… పక్కకు పడిపోయిందంటే.. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్టేడియం కుప్పకూలిన వెంటనే… పోలీసులు, మిగతా గ్యాలరీల్లో ఉన్న ప్రేక్షకులు స్పందించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

15 వందల మంది కూర్చున్న గ్యాలరీ కూలిపోవడంతో.. 150 మంది స్టీల్‌, సెంట్రింగ్‌ శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి హాహాకారాలతో మైదానమంతా మార్మోగిపోయింది. వలంటీర్ల సహాయంతో.. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లో క్షతగాత్రులను జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కొందరు బాధితులను వరండాల్లోనే ఉంచి, చికిత్సలు అందజేశారు.

తీవ్ర గాయాలైన నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని, యశోద ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారంతా సూర్యాపేట పట్టణంతోపాటు అనంతారం, పెన్‌పహాడ్, బాలెంల, గుంజలూరు, తాళ్ల ఖమ్మం పహాడ్, కేసారి, కాసరబాద, కుడకుడ, హుజూర్‌నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.