హైదరాబాద్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌..61 మందిపై కేసులు..41 బైకులు, 19 కార్లు, ఆటో సీజ్

హైదరాబాద్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌..61 మందిపై కేసులు..41 బైకులు, 19 కార్లు, ఆటో సీజ్

Police conduct drunk and drive tests : పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా..ఎన్ని రకాల హెచ్చరికలు చేసినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాగి వాహనాలు నడుపుతూ మృత్యువాత పడుతున్నారు. వనస్థలిపురంలో మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు… స్నేహితుడి ప్రాణం తీశాడు. గౌతమ్ అనే వ్యక్తి అతి వేగంగా కారును నడపడంతో ప్రమాదం జరిగింది.

గౌతమ్ తో పాటు కారులో సందీప్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ ఉన్నారు. మద్యం మత్తులో కారు కంట్రోల్ కాకపోవడంతో.. డివైడర్ ఎక్కించేశాడు. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో ఉన్న..సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.. ఆక్టోపస్‌లో పనిచేస్తున్న మల్లికార్జున్ ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యాడు..

జూబ్లీహిల్స్‌లో మద్యం మత్తులో… యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడిపి రెండు కార్లను, రెండు బైక్‌లను తన కారుతో ఢీకొట్టాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేశారు. అందులో 170 పాయింట్ల శాతంగా నమోదైంది. దీంతో షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్‌ చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. నిన్న బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న 61 మందిపై కేసులు నమోదు చేశారు. 19 కార్లు, 41 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.