ఉత్తర తెలంగాణలో అలజడి, మావోయిస్టుల కోసం పోలీసుల వేట

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 03:39 PM IST
ఉత్తర తెలంగాణలో అలజడి, మావోయిస్టుల కోసం పోలీసుల వేట

Telangana Encounter : ఆసిఫాబాద్‌ ఎన్‌కౌంటర్‌తో ఉత్తర తెలంగాణలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కిట్‌బ్యాగులలో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉట్నూర్, సిర్పూర్‌కు చెందిన 11మంది, తిర్యాణి, ఆసిఫాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు.



మావోయిస్టులతో వారికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. రాత్రి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కడంబలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరిని చుక్కాలుగా గుర్తించారు.

మరొకరి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనాస్థలంలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కీలక నేత భాస్కర్‌ అలియాస్‌.. అడెల్లు కోసం 45 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు భాస్కర్‌ దళం రాత్రి తారసపడినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులపై భాస్కర్‌ దళం కాల్పులు ప్రారంభించింది. అటు పోలీసులు కూడా ఫైరింగ్‌ మొదలుపెట్టడంతో… భాస్కర్‌ తృటిలో తప్పించుకున్నాడు. అయితే భాస్కర్‌ దళ సభ్యులు ఇద్దరు చనిపోయారు.



మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కోసం ఐదు జిల్లాల్లోనూ పోలీసులు సెర్చింగ్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రేహౌండ్స్‌ దళాలు, పోలీసు బలగాలు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

గిరిజన గ్రామాలను అష్టదిగ్బంధం చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. దీంతో గిరిజన గూడేల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆదివాసీలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.



గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. కాళేశ్వరం ముట్టకట్ట వంతెన దగ్గర నాటు పడవలతో పోలీసులు గాలిస్తున్నారు. ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం అటవీ ప్రాంతాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.



గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. డీఎస్పీ నరేష్‌కుమార్‌ ఏకే 47 ఆయుధాన్ని ధరించి కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కొత్తగూడ, గంగారం మండలాల్లో మావోయిస్టుల ఉనికి ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలోనే పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.



భాస్కర్‌ దళం కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. కూంబింగ్‌ ఆపరేషన్‌న మరింత ముమ్మరం చేశారు. రెండంచెలుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. రంగంలోకి మరిన్ని బలగాలను దింపుతున్నారు. పెన్నా పరివాహక ప్రాంతంలోనే భాస్కర్‌ దళం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాన్ని చుట్టుముడుతున్నారు. 14 పార్టీలతో అడవిని జల్లెడ పడుతున్నారు. దీంతో భాస్కర్‌ దళం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

భాస్కర్‌ దళం ఐదు రోజుల్లో పోలీసుల నుంచి మూడు సార్లు తప్పించుకున్నట్టు డీఐజీ చెబుతున్నారు. ఈనెల 18న అటవీ ప్రాంతంలో పోలీసులకు భాస్కర్‌ దళం తారసపడింది… అయితే పత్తి కూలీలను అడ్డుపెట్టుకుని తప్పించుకుపోయినట్టు డీఐజీ తెలిపారు. రాత్రి కూడా మరోసారి భాస్కర్‌ దళం పోలీసులకు ఎదురుపడిందని… లొంగిపోవాలని హెచ్చరించినా కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు.



ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. శనివారం చర్ల మండలంలో పోలీసులు అమర్చిన మూడు మందుపాతరలను గుర్తించడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.



ప్రత్యేకంగా ఛత్తీసగఢ్‌ రాష్ట్రం నుంచి వచ్చిపోయే వాహనాలపై ఫోకస్‌ పెట్టారు. అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశముందని భావించి…. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.