మీ నగ్న చిత్రాలు అడుగుతారు, సోషల్ మీడియా వాడే వారికి పోలీసుల వార్నింగ్

మీ నగ్న చిత్రాలు అడుగుతారు, సోషల్ మీడియా వాడే వారికి పోలీసుల వార్నింగ్

police warning for social media: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరూ లేరు. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారింది. అదే సమయంలో అందరి ఫోన్లలోనూ నెట్ ఉంటుంది. దీంతో అన్ని పనులకూ ఫోన్లే వాడుతున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్.. ఇలా.. అందరూ సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉన్నారు.

ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దానికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోయే వారు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా మోసాలు పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు డబ్బు కోసం సోషల్ మీడియాని వాడుతుంటే మరికొందరు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చాటింగ్ చేయడం ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం.. ఈ తరహా క్రైమ్స్ ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి.

తాజాగా విజయవాడకు చెందిన సుమంత్ ఇలానే చేశాడు. ఇన్ స్టాలో అందమైన అమ్మాయి ఫొటోతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా అమ్మాయిల మాదిరిగానే చాటింగ్ చేశాడు. వారి నగ్న ఫొటోలు సేకరించాడు. ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని తన కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా ఏకంగా 70మందికిపైగా బాధితులను వేధించాడు సుమంత్. చివరికి వాడి పాపం పండి పోలీసులకు చిక్కాడు.

ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా అకౌంట్లు కలిగిన వారిని అప్రమత్తం చేశారు. వారిలో అవేర్ నెస్ పెంచారు. వారికి పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు చెప్పారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులకు, మేసేజ్ లకు స్పందించొద్దని పోలీసులు సూచించారు. కొందరు మోసగాళ్లు అమ్మాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి యువతులకు గాలం వేస్తున్నారని చెప్పారు. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి నగ్న చిత్రాలను అడుగుతారని, అమ్మాయే కదా అని పంపి చాలామంది మోసపోతున్నారని చెప్పారు. అలా ఫొటోలు సేకరించిన కంత్రీగాళ్లు ఆ తర్వాత తమ నిజస్వరూపం బయటపెడతారని, ఆ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డబ్బులు గుంజడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తారని చెప్పారు.

సో, సోషల్ మీడియా అకౌంట్లు కలిగిన వారు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఏ మాత్రం అనుమానం కలిగినా, సందేహం వచ్చినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.