ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది.. అప్పుడే వరంగల్ కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 01:11 PM IST
ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది.. అప్పుడే వరంగల్ కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది

warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్‌ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సన్నాహక సమావేశాలు పోటాపోటీగా నిర్వహిస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఇప్పటి నుంచే ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీకి దీటుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.

టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే, అయినా:
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జర్నలిస్టులు ఉత్సాహం చూపుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికలను టీఆర్ఎస్‌, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా.. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి సవాల్‌గా భావిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకగానే ఆ పార్టీ నాయకులు ఊహిస్తున్నప్పటికీ.. బీజేపీ దూకుడు చూసి ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

పోటాపోటీగా సమావేశాలు:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కమలనాథులు నిర్వహించిన మరుసటి రోజే.. గులాబీ పార్టీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి సమరానికి సై అని సంకేతం ఇచ్చింది. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అధిగమించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ కేడర్‌కు నాయకులు దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఓటర్లను చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసింది.

మద్దతు కూడగట్టే పనిలో పల్లా, మాస్టర్ జీ విద్యా సంస్థల అధినేత సంగంరెడ్డి:
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, అన్ని స్థాయుల్లోని ప్రజా ప్రతినిధులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించి ఫోకస్ చేస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు అధికార పార్టీ నుంచి సిటింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాస్టర్ జీ విద్యా సంస్థల అధినేత సంగంరెడ్డి సుందర్ రాజు తమ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే మూడు జిల్లాల ముఖ్యులు, తన సామాజికవర్గం నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా సంగంరెడ్డి సుందర్ రాజు విద్యా సంస్థల యాజమాన్యాలు, లెక్చరర్లు సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల మద్దతును కూడగడుతున్నారని చెబుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ:
మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో కమలనాథులు ముందుకు కదులుతున్నారు. పట్టభద్రులైన కార్యకర్తలను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారట. విస్తృతంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారని టాక్‌. గతంలో చేసిన విద్యార్థి ఉద్యమాలు తమకు కలిసొస్తాయని వీరంతా భావిస్తున్నారని చెబుతున్నారు.

ఆ ఆశతో బరిలోకి కోదండరామ్:
ఇంకోవైపు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయనకు ఉద్యమ సమయం నుంచి వరంగల్‌ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. వరంగల్‌లో పట్టభద్రుల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నందున ఇక్కడి ఓటర్లు తనకు మద్దతిస్తారనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారట. ఇందుకు తగ్గట్లుగానే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోదండరాం పోటీపై ఆ పార్టీ క్లారిటీ కూడా ఇచ్చింది. దీంతో టీజెఎస్ సమరానికి సై అంటోంది.

కోదండరామ్ కు మద్దతిచ్చేందుకు సిద్ధపడని కాంగ్రెస్:
అటు హస్తం పార్టీలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్ల మధ్య పోటీ పెరిగిపోతోందట. ఈ కారణంగానే కోదండరామ్‌కు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధపడడం లేదని టాక్‌. మరోవైపు వామపక్ష పార్టీల్లో ఒకటైన సీపీఎం ఈ ఎన్నికలపై సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నా అభ్యర్థి ఎవరనేది, ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో స్పష్టత రాలేదని అంటున్నారు. అదే విధంగా సీపీఐ మాత్రం ఓ జర్నలిస్టుకు మద్దతివ్వాలనే దిశగా సమాలోచనలు చేస్తోందని చెబుతున్నారు.

బరిలోకి జర్నలిస్టులు:
యువ తెలంగాణ పార్టీ నుంచి జర్నలిస్ట్ రాణిరుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్‌, ఆమ్‌ ఆద్మీ తరఫున రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, కవి బి.తిరుమలరావుతోపాటు మరికొందరు జర్నలిస్టులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మీద ఈసారి శాసనమండలి పట్టభద్రుల పోరు మరింత రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొట్టేది బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్‌లో ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేయకుండా కోదండరామ్‌కు మద్దతు ప్రకటిస్తే ఎలా ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కొద్ది రోజులు వేచిచూస్తే మొత్తం క్లారిటీ వస్తుందని అంటున్నారు.