నువ్వా నేనా అంటున్న పొంగులేటి, పువ్వాడ.. ఖమ్మం గులాబీ తోటలో విబేధాల ముళ్లు

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 04:43 PM IST
నువ్వా నేనా అంటున్న పొంగులేటి, పువ్వాడ.. ఖమ్మం గులాబీ తోటలో విబేధాల ముళ్లు

Ponguleti Srinivasa Reddy vs Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ వర్గపోరుతో సతమతమైపోతోందని అంటున్నారు. నాయకుల మధ్య విభేదాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలు భావించారు. అనుకున్న విధంగానే ఫ్లెక్సీల కోసం ఆర్డర్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌ అనుమతి కోసం ప్రయత్నించారు. అంతకు ముందే నగరంలోని వస్త్ర దుకాణాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటై ఉన్నాయి. వాటిని దసరా రోజు కొంతమంది యువకులు హల్‌చల్ చేసి మరీ తొలగించారు. హోర్డింగులు సైతం ఎక్కి రచ్చరచ్చ చేశారు.

పొంగులేటి బర్త్ డే ఫ్లెక్సీలు కట్టకుండా చేసేందుకే హడావుడి:
వస్త్ర దుకాణాలకు సంబంధించిన ఫ్లెక్సీల పేరుతో చేసిన ఈ హడావుడి అంతా పొంగులేటి బర్త్ డే ఫ్లెక్సీలు కట్టకుండా చేసేందుకేనని ఆయన వర్గీయులు అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సెలవు రోజుల్లో ప్రత్యేక సమావేశమయ్యారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఫ్లెక్సీల తొలగింపు అంశం ఖమ్మం అధికార పార్టీ రాజకీయాల్లో కాక రేపుతోంది.

బీజేపీలోకి పొంగులేటి?
తాజా పరిణామం అధికార పార్టీ రాజకీయాల్లో దుమారానికి కారణమైందని అంటున్నారు. పొంగులేటి పుట్టిన రోజునాడు సత్తుపల్లిలో అభిమానులు కేక్ కట్ చేసి, ఆయనకు పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ విమర్శలు చేశారు. ఇటీవల పొంగులేటి ప్రధాన అనుచరులు కొందరు బీజేపీలో చేరుతున్నారు. దీంతో పొంగులేటి త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఆయన కూడా బీజేపీలో చేరేందుకు వీలుగా ముందు తన అనుచరులను ఆ పార్టీలోకి పంపిస్తున్నారని టాక్‌.

పొంగులేటి, పువ్వాడ మధ్య విభేదాలు లేవంట:
ఉమ్మడి జిల్లాలో పొంగులేటి.. కార్యకర్తలను కలవటం, వారికి భరోసా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కొంత కాలం సైలెంట్‌గానే ఉన్న ఆయన మళ్లీ తన పర్యటనలు వేగవంతం చేయటంతో అధికార పార్టీలోని ఇతర నేతల్లో టెన్షన్‌ మొదలైందని అంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసే ఉంటున్నారు. పొంగులేటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పువ్వాడ. వారి మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇరు వర్గాలకు చెందిన నేతలు చెబుతున్నారు.

పొంగులేటి, పువ్వాడ మధ్య విభేదాలు లేకపోతే ఫ్లెక్సీలు పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు?
పొంగులేటి, పువ్వాడ మధ్య విభేదాలు లేకపోతే ఫ్లెక్సీలు పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారనే చర్చ లేవనెత్తుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ గ్రూపులు, వర్గాలకు అతీతంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి పొంగులేటి విషయంలో ఎందుకు అలా జరుగుతుందో అంతుచిక్కడం లేదంటున్నారు. వేరే ఎవరైనా ఇలా రాద్ధాంతం సృష్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=3jlBQkt2_K4