TS BJP : బీజేపీలో చేరదామనుకునే నేతలకు ఊహించని షాకులు..టికెట్లు, పదవులు ఆశిస్తే కుదరదంటున్న కాషాయదళం

కాషాయ కండువా కప్పుకుందామనుకుంటున్న లీడర్లకు.. ఊహించని షాకులు ఎదురవుతున్నాయ్. అనుకోని పరిస్థితులు కనబడుతున్నాయ్. కమలదళం వైపు చూస్తున్నా.. అది చూపులతోనే సరిపోతోంది. మిగతా పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు.. బీజేపీలో నెలకొన్న పరిస్థితులు.. అస్సలు అంతుచిక్కడం లేదట.

TS BJP : బీజేపీలో చేరదామనుకునే నేతలకు ఊహించని షాకులు..టికెట్లు, పదవులు ఆశిస్తే కుదరదంటున్న కాషాయదళం

Ts Bjp

TS BJP : రావాలనుకుంటున్నారు.. రాలేకపోతున్నారు. చేరదామనుకుంటున్నారు.. చేరలేకపోతున్నారు. జంప్ అవుదామనుకుంటున్నారు.. అవలేకపోతున్నారు. ఇప్పుడున్న కండువాలు పక్కన పడేసి.. కాషాయ కండువా కప్పుకుందామనుకుంటున్న లీడర్లకు.. ఊహించని షాకులు ఎదురవుతున్నాయ్. అనుకోని పరిస్థితులు కనబడుతున్నాయ్. కమలదళం వైపు చూస్తున్నా.. అది చూపులతోనే సరిపోతోంది. మిగతా పార్టీల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు.. బీజేపీలో నెలకొన్న పరిస్థితులు.. అస్సలు అంతుచిక్కడం లేదట.

దుబ్బాక బైపోల్‌లో గెలిచారు.. గ్రేటర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. చెప్పుకోదగ్గ సీట్లు గెలిచారు. హుజూరాబాద్‌ బైపోల్‌లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టారు. గెలిచిన ప్రతిసారీ.. పార్టీలోకి నేతల క్యూ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాషాయం నేతలు. ఆ జిల్లా నుంచి వాళ్లు టచ్‌లో ఉన్నారు.. ఈ జిల్లా నుంచి వీళ్లు టచ్‌లో ఉన్నారని పొలిటికల్ హైప్ క్రియేట్ చేశారు. ఈ మధ్య ఓ లీడరైతే.. అధికార పార్టీ నుంచి ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మంత్రులు టచ్‌లో ఉన్నారని ప్రకటించడం.. సంచలనంగా మారింది. ఇప్పటికీ.. అది టచ్ దగ్గరే ఆగిపోయింది. ఇక.. కాంగ్రెస్ నుంచి ఇప్పటికిప్పుడు చేరేందుకు చాలా మంది ఉన్నారంటూ ఊదరగొట్టారు. కానీ.. చెప్పుకోదగ్గ లీడర్లెవరూ బీజేపీ వైపు చూడలేదు. పార్టీలో చేరలేదు.

అయితే.. మిగతా పార్టీల నుంచి బీజేపీలో చేరికలు లేకపోవడం వెనుక.. పెద్ద రీజనే ఉందనే చర్చ సాగుతోంది. పార్టీలో కొత్తగా ఎవరు చేరదామనుకున్నా.. ఎలాంటి హామీ ఇవ్వడం లేదట. కమలదళంలో చేరాలనుకున్నోళ్లు.. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ పాలన చూసి.. ఆకర్షితులై రావాలే తప్ప.. పదవుల కోసమో.. టికెట్ల కోసమో చేరతానంటే.. చేర్చుకునేది లేదంటున్నారట. పార్టీ కోసం కష్టపడితే.. పదవులు వాటంతటవే వస్తాయనే ఉచిత సలహాలు మాత్రం గట్టిగా ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే పార్టీలో కొత్తగా చేరిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి.. చేరాలనుకున్నోళ్లు కూడా.. పార్టీ ఆఫీసు దాకా వచ్చి.. రివర్స్ గేర్ వేసుకొని.. రిటర్న్ వెళ్లిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షప‌తి యాద‌వ్ కుమారుడు ర‌వియాద‌వ్, ఈటలతో కలిసి బీజేపీలో చేరిన తుల ఉమ, స్వౌమిగౌడ్, అశ్వత్థామ రెడ్డి, యువ తెలంగాణ పార్టీని విలీనం చేసిన జిట్టా బాలకృష్ణా రెడ్డి లాంటి నేతలందరికీ.. వాళ్ల వాళ్ల ప్రాంతాల్లో.. పాతుకుపోయి ఉన్న స్థానిక బీజేపీ నేతలతో.. ఇబ్బందులు తప్పడం లేదని.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటివన్నీ చూశాక.. బీజేపీలో చేరాలనుకున్న నేతలంతా.. ఆలోచనలో పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా మహేశ్వరం టికెట్ ఆశిస్తున్నారనే.. టాక్ బయటకొచ్చింది. దానిపై.. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతోనే.. ఆగిపోయారనే ప్రచారం సాగుతోంది. అసంతృప్తితో రగిలిపోతూ.. ఈ మధ్యకాలంలోనే ఖమ్మంలో మీట్ అయిన ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎంపీ కూడా.. ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో.. బీజేపీలో చేరాలా.. వద్దా.. అనే డైలమాలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. బీజేపీలో చేరాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కండీషన్ పెట్టడంతో.. ఆయన కూడా తన చేరికను వాయిదా వేస్తున్నారని అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఎలాంటి హామీ.. ఇవ్వకపోవడంతో పాటు బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా.. పార్టీలో చేరికలకు బ్రేకులు వేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. బీజేపీలో చేరేందుకు సిద్ధమైనా.. వెనక్కి తగ్గి కాంగ్రెస్‌లో చేరారనే చర్చ నడుస్తోంది. అలాగే.. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా.. బీజేపీ గేట్లు తెరచుకోకపోవడంతో.. తిరిగి టీఆర్ఎస్‌ గూటికే వెళ్లిపోయారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే.. వీరి చేరికలకు బ్రేకులు వేశాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే.. బీజేపీలో చేరేందుకు నాయకులు క్యూ కట్టేదెప్పుడో.. కాషాయ కండువా కప్పుకునేదెప్పుడనే చర్చ సాగుతోంది.