Post Offices : పాస్‌పోర్టులు, పన్ను చెల్లింపులు.. పౌరసేవా కేంద్రాలుగా పోస్టాఫీసులు

పోస్టాఫీస్ అంటే వెంటనే గుర్తుకొచ్చింది ఉత్తరాలు. అవును ఏదైనా పోస్టు చేయాలంటే మనం వెళ్లేది పోస్టాఫీస్ కదా. ఇంతకాలం కేవలం ఉత్తరాల బట్వాడా సేవలు మాత్రమే అక్కడి దొరికేవి. ఇక ముందు అలా కాదు.

Post Offices : పాస్‌పోర్టులు, పన్ను చెల్లింపులు.. పౌరసేవా కేంద్రాలుగా పోస్టాఫీసులు

Post Office

Post Office : పోస్టాఫీస్ అంటే వెంటనే గుర్తుకొచ్చింది ఉత్తరాలు. అవును ఏదైనా పోస్టు చేయాలంటే మనం వెళ్లేది పోస్టాఫీస్ కదా. ఇంతకాలం కేవలం ఉత్తరాల బట్వాడా సేవలు మాత్రమే అక్కడి దొరికేవి. ఇక ముందు అలా కాదు. సీన్ మారిపోనుంది. పోస్టాఫీసులో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై పాస్‌పోర్టు కావాలంటే పట్టణానికో, మీసేవా కేంద్రానికో వెళ్లాల్సిన పని లేదు. మారుమూల గ్రామమైనా.. తపాలా కార్యాలయానికి వెళితే చాలు. అంతేకాదు వంట గ్యాస్‌, మొబైల్‌ ఫోన్, టీవీ డీటీహెచ్‌ రీచార్జ్‌, రైలు, విమాన టికెట్లు బుకింగ్, ఆస్తి పన్ను, బీమా పాలసీ ప్రీమియం చెల్లింపు..ఇలా అన్ని రకాల సేవలు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉంటాయి.

ఇంతకాలం ఉత్తరాల బట్వాడా సేవలు అందించిన పోస్టాఫీసులు ఇప్పుడు పౌరసేవా కేంద్రాలుగా మారిపోతున్నాయి. క్రమంగా ఉనికి కోల్పోతున్న పోస్టాఫీసులకు కొత్త ఉత్తేజం కల్పించే ఉద్దేశంతో పౌర సేవలందించే కేంద్రాలుగా వాటిని రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో నిత్యం ప్రజలకు అవసరమైన పలు సేవలను అందించేలా ఏర్పాటు చేసింది. ఈమేరకు తపాలా సిబ్బందికి శిక్షణను పూర్తి చేసి దశలవారీగా అన్ని పోస్టాఫీసుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పోస్టాఫీసుల్లో కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ)లను ఏర్పాటు చేసింది.

ఫోన్లు, డీటీహెచ్‌ రీచార్జ్, పన్నులు, బీమా ప్రీమియం చెల్లింపు లాంటి సేవల కోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. ఇక పాన్‌కార్డు, పాస్‌పోర్టులాంటి సేవలకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవికూడా వినియోగదారులకు ఏమాత్రం భారం లేకుండా ఖరారు చేశారు. చిన్నచిన్న ఊళ్లలో ఉండేవారు ఆయా సేవలు పొందేందుకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఊర్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్తే ఆయా పనులు పూర్తవుతాయి.

సమయం, దూరాభారం, వ్యయ ప్రయాసలు లేకుండానే సులభంగా పనులు అయ్యేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. గతేడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి హెడ్‌ పోస్టాఫీసులలో ప్రారంభించారు. ఇవి విజయవంతం కావటంతో ఇప్పుడు హైదరాబాద్‌ మొదలు మారుమూల పల్లె వరకు ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ప్రారంభించారు.