Corona Pregnant : గుండెలు పిండే విషాదం… కరోనా అనుమానంతో చికిత్స చేయని కార్పొరేట్‌ ఆసుపత్రులు, అంబులెన్సులోనే గర్భిణి మృతి

కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరోనా అని అనుమానించి నిండుచూలాలిపై ఆసుపత్రులు కనికరం చూపలేదు. 5 ఆసుపత్రులు తిరిగినా లాభం లేకపోయింది. 5 గంటలుగా అంబులెన్సులో కొట్టుమిట్టాడినా కార్పొరేటు గుండెలు కరగలేదు. ఫలితంగా రెండు ప్రాణాలూ అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

Corona Pregnant : గుండెలు పిండే విషాదం… కరోనా అనుమానంతో చికిత్స చేయని కార్పొరేట్‌ ఆసుపత్రులు, అంబులెన్సులోనే గర్భిణి మృతి

Corona Pregnant

Corona Pregnant : కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరోనా అని అనుమానించి నిండుచూలాలిపై ఆసుపత్రులు కనికరం చూపలేదు. 5 ఆసుపత్రులు తిరిగినా లాభం లేకపోయింది. 5 గంటలుగా అంబులెన్సులో కొట్టుమిట్టాడినా కార్పొరేటు గుండెలు కరగలేదు. ఫలితంగా రెండు ప్రాణాలూ అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

హైదరాబాద్‌ మల్లాపూర్‌కు చెందిన పావని(22)కి గతేడాది ఆగస్టులో ఏపీలోని ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో వివాహం జరిగింది. పురిటి కోసం పావని పుట్టింటికి వచ్చింది. ఇటీవలే ఎనిమిది నెలలు నిండడంతో తల్లిదండ్రులు జోగారావు, నీలవేణిలు పావనిని స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించారు. అందులో భాగంగానే గురువారం(మే 13,2021) తన సోదరితో కలిసి ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువుందని సెలైన్‌ ఎక్కించి పంపించేశారు. శుక్రవారం(మే 14,2021) తెల్లవారుజామున ఆయాసం మొదలైంది. వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్‌ అయి ఉండొచ్చన్న అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు. ఎప్పుడూ ఇక్కడికే వస్తున్నామని.. వైద్యం చేయాలని తల్లి వేడుకున్నా ఫలితం లేకపోయింది.

దిక్కుతోచని స్థితిలో అంబులెన్సులో మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. తర్వాత లక్డీకాపూల్‌లోని ఓ హాస్పిటల్ కు చేరుకున్నారు. తమ దగ్గర వెంటిలేటర్‌ లేదని వారు చేర్చుకోలేదు. ఎల్‌బీనగర్‌లోని మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. వారు మరో హాస్పిటల్‌కు పంపించారు. అక్కడికి తీసుకెళ్లాక మొదటి ఫ్లోర్‌లో చేర్చుకుని ఇక బతకడం కష్టం.. గాంధీకి గానీ, కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో బిడ్డయినా బతుకుతుందని చెప్పి పంపించేశారు.

కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కన్నుమూసింది. ఉదయం 11.30 గంటలకు అక్కడికి చేరగా.. అంబులెన్సులోనే పరీక్షించిన వైద్యురాలు తల్లీబిడ్డా ఇద్దరూ మృతిచెందినట్లు నిర్ధారించారు. పొద్దున్నుంచి ఇద్దరినీ కాపాడుకునేందుకు తల్లి నీలవేణి పడిన తపన, చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అంబులెన్సుకే రూ.30 వేలు అయ్యాయి.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. స్థానికులను కంటతడి పెట్టించింది. కరోనా ఏమో అనుమానంతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరించిన తీరుని అంతా తప్పుపడుతున్నారు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన చెందుతున్నారు. సమయానికి ఏదో ఒక ఆసుపత్రి వారు స్పందించి చికిత్స అందించి ఉంటే, రెండు నిండు ప్రాణాలు బతికేవని వాపోయారు. పావని మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.