మానవత్వానికే మచ్చ : బస్టాప్‌ వెనుక ప్రసవం

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 08:02 AM IST
మానవత్వానికే మచ్చ : బస్టాప్‌ వెనుక ప్రసవం

మానవత్వానికి మచ్చ. ఓ నిండు గర్భిణీ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో..బస్టాపు వెనుక ప్రసవించింది. ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఛంపక్ హిల్స్ మాతశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డి పల్లికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య షేక్ బీబీని నాలుగో కాన్పు కోసం సిద్ధిపేట చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యుల సూచనల మేరకు 108 అంబులెన్స్ లో ఛంపక్ హిల్స్ మాతశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లారు వైద్యులు.

పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తం తక్కువగా ఉందని గుర్తించారు. వెంటనే హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. అప్పటికే బీబీకి నొప్పులు అధికమయ్యాయి. కాన్పు చేయండి..మాదే బాధ్యత అని అన్నా..వైద్యులు నిరాకరించారు.

హన్మకొండకు వెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఎదురు చూశారు. ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు. చివరకు ప్రైవేటు వాహనంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో..పరిస్థితిని గమనించి..అక్కడే ఉన్న బస్టాపు వెనుకకు బీబీ వెళ్లిపోయింది కొద్దిసేపటి అనంతరం బస్టాపు వద్ద అరుపులు వినిపించడంతో భర్త, తల్లి వెళ్లి చూశారు.

పండంటి కొడుకును చేతిలో పట్టుకుని బీబీ కనిపించడంతో తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడండి..అంటూ రోదించడంతో..స్పందించిన వైద్యులు వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.