Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్‌ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్

వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.

Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్‌ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్

Shocking Treatment

private hospital : ప్రాణాపాయ స్థితిలో వచ్చిన రోగి నుంచి కాసులు దండుకుందామనుకున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యే సరికి రికార్డులు మార్చేశారు. తమ చేతులకు మరకలు అంటుకోకూడదని.. క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ను.. . స్టేబుల్ అంటూ డిశ్చార్జ్ చేసేసి సర్కార్ దవాఖానాకు పంపేశారు.. కానీ.. ఆపరేషన్ చేసినప్పుడు పుర్రె పైభాగాన్ని తీసేసిన ప్రైవేటు డాక్టర్లు.. తిరిగి అతికించలేదు.. దీంతో.. పుర్రె ప్రైవేటు ఆస్పత్రిలో.. పేషెంట్ ప్రభుత్వాసుపత్రిలో ఉండిపోయారు.. అత్యంత దారుణమైన ఈ సంఘటన వరంగల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్‌కు ఏమైనా జరిగితే తమ ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని ఓ నాటకం ప్రారంభించారు. పేషంట్ కండీషన్ సీరియస్‌గా ఉన్నా స్టేబుల్‌గానే ఉందంటూ తప్పుడు నివేదిక సిద్ధం చేశారు. ఆరోగ్య శ్రీ సిబ్బందితో కుమ్మక్కై పేషంట్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేలా పథకం పన్నారు.

Fake Doctor: డాక్టర్ నంటూ ఆపరేషన్ చేసిన సెక్యూరిటీ గార్డు..మహిళ మృతి..మేం ఏం చేయగలం అన్న ఆసుప్రతి యాజమాన్యం

తలపై పుర్రె పైభాగం వేరు చేసి పరిస్థితి విషమంగా ఉన్న పేషంట్‌ను అనాథలా వదిలేశారు. పేషంట్ భార్య పిల్లలు ఉన్నా వారికి సరైన సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆరోగ్యశ్రీ సిబ్బంది సాయంతో డిశ్చార్జి రిపోర్ట్ తయారు చేశారు. ఇక ఆరోగ్యశ్రీలో కేవలం ఆరు రోజులే ట్రీట్ మెంట్ చేస్తారని తర్వాత ట్రీట్ మెంట్ చేయాలంటే రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని అందుకు సిద్ధమైతేనే ఆసుపత్రిలో ఉంచాలని… లేదంటే ఎంజీఎంకు తరలించాలని పేషంట్ బంధువులను బెదిరించారు. అంతేకాదు ఈ నెల 18న ఆసుపత్రిలో చేరినట్టు 15న ఆపరేషన్ చేసినట్టు రిపోర్టులు తయారు చేయడం చూస్తుంటే.. ఆస్పత్రిలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం అయిపోతుంది.

ఈనెల 20న పేషెంట్ కండీషన్ స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు తప్పుడు రిపోర్ట్ సృష్టించారు. ఆరోగ్య శ్రీ సిబ్బంది కూడా పేషెంట్ కండీషన్ పట్టించుకోకుండా డిశ్చార్జి చేస్తున్నట్టు ఐసీయూలోనే ఫోటోలు దిగారు. ప్రైవేటు హాస్పిటల్ ఒకలా ఆరోగ్యశ్రీ సిబ్బంది మరోలా వివరాలు నమోదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేటు ఆసుపత్రి 15న ఆసుపత్రిలో చేరినట్టు 20న డిశ్చార్జ్ అయినట్టుగా రిపోర్టు ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది బెదిరింపులకు భయపడి పేషంటును ఎంజీఎంకు తరలించారు.

Bribe ICU Beds : దిగజారిన డాక్టర్.. ఐసీయూలో రెండు బెడ్ల కోసం రూ.3లక్షలు లంచం డిమాండ్

అయితే శస్త్ర చికిత్స సమయంలో వేరు చేసిన పుర్రె పైభాగం ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉండిపోయింది. పేషంట్ మాత్రం ఎంజీఎంలో ఉన్నాడు. ఇప్పుడు పేషంట్ బంధువులు అయోమయంలో ఉన్నారు. ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య శ్రీ సిబ్బంది పరస్పరం విరుద్ధమైన నివేదికలు ఇచ్చారు. కేవలం కాసుల కక్కుర్తితో పేషంట్ కండీషన్ విషమంగానే ఉన్నా పట్టించుకోకుండా డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం పేషంట్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తమకు న్యాయం చేయాలని పేషెంట్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

పేషంట్‌ను డిశ్చార్జి చేయడంపై ఆరోగ్య శ్రీ సిబ్బంది మరో వాదన వినిపించారు. పేషంట్ బంధువుల కోరిక మేరకే డిశ్చార్జి చేశామని వెంటలేటర్‌పై ఉండగానే ఎంజీఎంకు తరలించామని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ మెడికో సందీప్. అయితే పేషంట్ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు సందీప్. పుర్రె పైభాగం ఆసుపత్రిలోనే భద్రపరిచామని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఆపరేషన్ చేసి పుర్రెను డాక్టర్లు అతికించేందుకు మరో ఆపరేషన్ చేస్తారని చెప్పారు. పేషంట్ కండీషన్ చూసి ఆరోగ్య శ్రీ కార్డు అప్ డేట్ లేకున్నా చేర్చుకున్నామని మెడికో సందీప్ చెప్పారు.

Govt Hospital : అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. మృతదేహాన్ని తరలించేందుకు రూ.80 వేలు డిమాండ్‌

అయితే పూర్తిగా నయం కాకముందే ఎందుకు డిశ్చార్చి చేశారంటే మాత్రం ఆయన విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఆరోగ్య శ్రీలో, హాస్పిటల్ రికార్డులో తప్పులు దొర్లటానికి టైపింగ్ మిస్టేక్ కారణమని ప్రైవేటు హాస్పిటల్ చైర్మన్ పోల నటరాజ్ అన్నారు. మానవతా దృక్పథంతోనే ఆపరేషన్ చేశామని.. ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదన్నారు. బంధువుల కోరిక మేరకే వెంటిలేటర్‌పై ఉండాలనే పేషంట్‌ను ఎంజీఎంకు తరలించారని చెప్పారు. క్లరికల్ మిస్టేక్స్ మాత్రమే జరిగాయని ఎలాంటి అవకతవకలు లేవన్నారు.

పేషంట్ మల్లేశ్‌ను అపస్మారక స్థితిలో హాస్పిటల్ కు తీసుకొచ్చారని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం వెంటలేటర్ పైనే మల్లే‌‌శ్‌కు చికిత్స జరుగుతోందని చెప్పారు. పేషంట్ కండీషన్ విషమంగానే ఉందని చెప్పారు. మొత్తం మీద పేషంట్ కండీషన్ కంటే ఆరోగ్యశ్రీ డబ్బులు రాకుండా పోతాయనే ప్రైవేటు హాస్పిటల్‌ సిబ్బంది హడావిడిగా డిశ్చార్జ్‌ చేసినట్టు అర్థమవుతోంది. పేషంట్ చికిత్స సమయంలో చనిపోతే.. తమ హాస్పిటల్‌కు చెడ్డ పేరు వస్తుందనే ఇలాంటి పనులకు పాల్పడినట్టు తెలుస్తోంది.