పేదలకు మాత్రమే.. అందరికీ అదే ఫీజు అంటే కుదరదు

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 09:24 AM IST
పేదలకు మాత్రమే.. అందరికీ అదే ఫీజు అంటే కుదరదు

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే వారికి మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు, కిమ్స్‌ ఆస్పత్రుల అధినేత భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్, మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన చర్చల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. కరోనా చికిత్సకు ఫీజులు వసూలు చేయాలని, ఆ ప్రకారమే చెల్లిస్తామని బీమా కంపెనీలు చెబుతున్నాయి. అయితే అందరికీ అలా చేయాలంటే కుదరదని ప్ర భుత్వానికి విన్నవించాయి ఆసుపత్రులు. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల ప్రకారం అందరికీ కరోనా వైద్యం కుదరదు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకు ఆ ఫీజులకు చికిత్స అందించాలంటేనే ఒప్పుకున్నామని అన్నారు.

కర్ణాటక, మహారాష్ట్రలలో విడుదల చేసిన జీవోల్లో కూడా కేవలం నగదు చెల్లించే రోగులకే ఆయా రాష్ట్రాలు ఫిక్స్‌ చేసిన ఫీజులను వసూలు చేయాలని జీవోల్లో ఉంది. ప్రైవేటు బీమా, సీజీహెచ్‌ఎస్‌ వంటి రోగులకు ప్రభుత్వం ఉత్తర్వులు వర్తించవని అన్నారు. అది కూడా సాధారణ వార్డుల్లో ఉన్న వారికే ఇది వర్తిస్తుందని, అందరికీ ఆ ఫీజులతో వైద్యం చేయడం సాధ్యం కాదని చెప్పారు.

అందరికీ అవే ఫీజులతో చికిత్స చేస్తే ఆసుపత్రులు నడపలేమని వారు అన్నారు. నగదు చెల్లించే వారికి మాత్రమే ఆ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు. 50 శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వ ప్యాకేజీ కిందకు రారని, వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనని అన్నారు.

Read Here>>కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్, ప్రభుత్వం కీలక నిర్ణయం