పీపీఈ కిట్లు, ప్రతీ షో కి కుర్చీలు శానిటైజ్‌, లక్షణాలు ఉంటే ఇంటికే.. సినిమా థియేటర్‌లో తీసుకోబోయే కరోనా జాగ్రత్తలివే

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 01:32 PM IST
పీపీఈ కిట్లు, ప్రతీ షో కి కుర్చీలు శానిటైజ్‌, లక్షణాలు ఉంటే ఇంటికే.. సినిమా థియేటర్‌లో తీసుకోబోయే కరోనా జాగ్రత్తలివే

సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్‌ సినిమాస్‌ సమాధానం ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఒకవేళ థియేటర్లు రీఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ పీవీఆర్‌ సినిమాస్‌ ఓ వీడియో విడుదల చేసింది. కరోనా నుంచి ప్రేక్షకులకు రక్షణ కల్పించడానికి థియేటర్లలో చేపట్టే చర్యలను వివరించింది.

థియేటర్‌లో తీసుకోబోయే కరోనా జాగ్రత్తలు ఇవే:
* బాక్సాఫీస్‌ దగ్గర టికెట్‌ తీసుకునేటప్పుడు తప్పకుండా ఒక మీటర్‌ దూరం పాటించాలి.
* డిజిటల్‌ పేమెంట్లకే ప్రాధాన్యం ఇవ్వాలి.
* ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించడం, ఎవరికైనా అనారోగ్యం తాలూకూ లక్షణాలు కనిపిస్తే వెనక్కి పంపడం
* ఒకేసారి వినియోగించే త్రీడీ గ్లాసులు , పీపీఈ కిట్లు అమ్మడం
* ప్రతి షోకు కుర్చీలను శానిటైజ్‌ చేయడం
* ఒక సీటును భౌతిక దూరానికి మాత్రమే వదిలేయడం
ఇలా ఆ సంస్థ బోలెడు రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆ వీడియోలో తెలిపింది.
అంతేకాదు థియేటర్లలో పనిచేసే సిబ్బందికి కొవిడ్‌ నిబంధనల పట్ల శిక్షణ కూడా ఇవ్వనుంది. పీవీఆర్‌ సినిమాస్‌కు దేశవ్యాప్తంగా 822 స్క్రీన్స్ ఉన్నాయి. శ్రీలంకలోనూ ఈ సంస్థ సినిమాలు ప్రదర్శిస్తుండటం విశేషం. ప్రభుత్వం అనుమతులు రాగానే తాము థియేటర్లు తెరవడానికి ఎంత సిద్ధంగా ఉన్నామో చెప్పిందీ ఈ సంస్థ.

క్యూలు, తోపులాటలు, అరుపులు, కేకలు.. ఇక కనిపించవు:
సాధారణంగా కొత్త సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల దగ్గర ఉండే హంగామా అంతా ఇంతా కాదు. చాంతాడంత క్యూలూ, తోపులాటలు.. టికెట్ల కోసం అభిమానుల పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. తెరపై బొమ్మ పడ్డాక స్నేహితులతో చేసే అరుపులు, కేకలతో థియేటర్‌ మొత్తం హోరెత్తేది. అయితే కరోనా దెబ్బకు ఇకపై ఈ సందడి కనిపించదు. కాగా, కరోనా భయం కారణంగా 100 రోజులకుపైగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్నింటికి అనుమతులు ఇచ్చినా, ప్రజల సంక్షేమం దృష్ట్యా థియేటర్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. థియేటర్లలో భౌతిక దూరం పాటించడం కష్టం కనుక కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండటంతో వాటిని తెరిచేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పటికే బొమ్మ పడక 100కు పైగా రోజులు గడిచాయి. ఇంకా ఎన్ని రోజులు ఇలా అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.